రిలయన్స్ 46 వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) బోర్డుకి నీత అంబానీ రాజీనామా చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బాధ్యతల్ని అంబానీ వారసులు చేపట్టనున్నారు.
ముఖేష్ అంబానీ వారసులు ఈశా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్‌లో నాన్ - ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లుగా నియమించారు. ఏజీఎం సమావేశానికి ముందు జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ముకేష్ తెలిపారు. వీరి నియామకాన్ని షేర్ హోల్డర్లు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆర్‌ఐఎల్ బోర్డుకి ముఖేష్ అంబానీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
నీతా అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు రాజీనామా చేసినప్పటికీ, ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతూనే ఉంటారని, తద్వారా కంపెనీ వృద్దికి సహాయసహకారాలుంటాయని తెలిపారు.
రాజీనామా ఎందుకు చేశారంటే?
రిలయన్స్ ఫౌండేషన్‌కు మార్గనిర్దేశం చేయడానికి, దేశ సేవ కోసం తమ సమయాన్ని వెచ్చించాలనే ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ బోర్డు నుండి నీతా అంబానీ రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు రిలయన్స్ పేర్కొంది.
పిల్లలు చేతికొచ్చిన వేళ
ముఖేష్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలు చేతికి వచ్చిన వేళ ఆస్తుల పంపకం మొదలు పెట్టారు. న్యూ ఎనర్జీని చిన్న కుమారుడు అనంత్ అంబానీకి , టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతల్నిపెద్ద కుమారుడు ఆకాష్‌కు, కవల సోదరి ఇషా అంబానీ రిటైల్ వ్యాపారం అప్పజెప్పారు.
శామ్ వాల్టన్ బాటలో ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కొనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేష్ అంబానీ.. ఒక దుకాణంతో ప్రారంభించి ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్‌గా ఎదిగిన శామ్ వాల్టన్ ఫాలో అవుతున్నారు. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారని బ్లూంబర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది.
కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నట్లు బ్లూంబర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment