![Microsoft CEO Satya Nadella Gets 63pc Hike in Pay Package](/styles/webp/s3/article_images/2024/10/25/Microsoft.jpg.webp?itok=84NNj1ul)
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.
సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్ అవార్డుల విలువ 39 మిలియన్ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్ డాలర్లు.
జూన్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..
ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్‌లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment