
పెద్ద, మధ్య స్థాయి నగరాల మధ్య తగ్గుతున్న అంతరం
బ్లూమ్‌బర్గ్‌ఎన్‌ఈఎఫ్ నివేదిక 10 రాష్ట్రాల్లో అధ్యయనం
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) డిమాండ్ విషయంలో పెద్ద, మధ్య స్థాయి నగరాల మధ్య అంతరం తగ్గుతోందని ఒక నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం ఈవీలకు తదుపరి డిమాండ్ ద్వితీయ శ్రేణి నగరాల నుంచి రానుంది. బ్లూమ్‌బర్గ్‌ఎన్‌ఈఎఫ్ (బీఎన్‌ఈఎఫ్) 10 రాష్ట్రాల్లోని 207 నగరాల్లో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్లపై నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కొన్ని ద్వితీయ శ్రేణి మార్కెట్లలో టూవీలర్ల అమ్మకాలు .. మెట్రోపాలిటన్ నగరాలను కూడా దాటేశాయి. టైర్ 2 సిటీలను తీసుకుంటే అందులోనూ రాష్ట్రాల రాజధానుల్లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు అత్యధికంగా ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు..
⇒ భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విక్రయాల మధ్య అంతరాలు గణనీయంగా ఉన్నాయి. జనాభా అధికంగా ఉండి, అభివృద్ధి చెందిన, సంపన్న ప్రథమ శ్రేణి నగరాలు ప్రస్తుతం ఈవీలకు ప్రధాన హబ్‌లుగా ఉంటున్నాయి.
⇒ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈవీల తయారీ సంస్థలు కార్యకలాపాలను మరింతగా విస్తరించి, సరైన వ్యూహాలు పాటిస్తే ఈ నగరాల్లో డిమాండ్ పుంజుకోగలదు. ఇక అవగాహన, ఆదాయాలు పరిమితంగా ఉండే చిన్న నగరాల్లో ఈవీల విక్రయాలు పెరగాలంటే పాలసీపరమైన మద్దతు కీలకంగా ఉంటుంది.
⇒ విద్యుత్ టూవీలర్లు, కార్ల వినియోగానికి సంబంధించి ప్రథమ శ్రేణి నగరాల్లో బెంగళూరు అన్నింటికన్నా ముందు ఉంది. సంపన్న నగరాల్లో ఈవీల వినియోగం అధికంగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. స్థిరంగా కాస్త ఎక్కువ ఆదాయం చేతికి వచ్చే యువ జనాభా ఎక్కువగా ఉండటం, పూర్తిగా ఎలక్ట్రిక్ క్యాబ్‌లనే నడిపే ఆపరేటర్లు విస్తరిస్తుండటం, ఈవీ మోడల్స్ లభ్యత పెరుగుతుండటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
⇒ రాజస్థాన్‌లోని అయిదు టైర్ 2 సిటీల్లో అమ్ముడైన మొత్తం ఎలక్ట్రిక్ కార్లలో జైపూర్ వాటా అత్యధికంగా 79శాతంగా నమోదైంది. 2022లో జైపూర్‌వాసులు 1,000 కన్నా తక్కువ ఎలక్ట్రిక్ కార్లు కొనగా 2023లో ఏకంగా 2,400 పైచిలుకు కార్లను కొన్నారు.
⇒ 10 రాష్ట్రాలవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో హై–స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాల వార్షిక వృద్ధి రేటు .. ప్రథమ శ్రేణి నగరాలను మించి నమోదైంది. 70 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 51 శాతంగా, 131 తృతీయ శ్రేణి పట్టణాల్లో 30 శాతంగా ఉంది.
⇒ పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ఎలక్ట్రిక్ టూ–వీలర్ల మార్కెట్లు.. ప్రథమ శ్రేణి మార్కెట్లను మించి ఉంటున్నాయి. 2023లో అహ్మదాబాద్ (17,300), ముంబై (13,800), చెన్నై (13,710)కి మించి సూరత్‌లో 20,150, జైపూర్‌లో 18,600 అమ్ముడయ్యాయి. నాగ్‌పూర్‌లో దాదాపు రాజధాని ముంబై స్థాయిలో 13,730 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. కొల్హాపూర్, ఇండోర్ వంటి నగరాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి.
⇒ వాహనాల తయారీ సంస్థలు చిన్న పట్టణాల్లో తమ విక్రయాలు, డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లను పెంచుకుంటున్నాయి. వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు, వారికి ఈ వాహనాలు మరింతగా అందుబాటులోకి వచ్చేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.
⇒ పెట్రోల్‌తో నడిచే వాహనాల స్థాయికి రేట్లు తగ్గితే తప్ప తృతీయ శ్రేణి పట్టణాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే పాలసీపరమైన మద్దతు, ముఖ్యంగా ఆర్థికంగా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment