హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది టెక్నాలజీ ఆధారిత రంగాల్లో నియామకాలు జోరుగా ఉంటాయని మాన్‌స్టర్.కామ్ నివేదిక తెలిపింది. ‘ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో నియామకాల డిమాండ్ పెరుగుతుంది. వేగవంతమైన సాంకేతికతను స్వీకరించడంతో ఏఐ, మెషీన్ లెర్నింగ్ పాత్ర 2022లో వృద్ధి చెందుతుంది. నూతన సాధారణ స్థితికి అనుగుణంగా కంపెనీలు సంస్థాగత వ్యూహాలు, లక్ష్యాలను మార్చుకున్నప్పుడు సాంకేతికతను స్వీకరించడం మళ్లీ రెట్టింపు అయింది. ఉద్యోగాల మార్పు, ఉపాధి సంక్షోభం నేపథ్యంలో నిపుణులైన మానవ వనరుల కోసం వేట పెరగడంతో నైపుణ్యం పెంచుకునే ప్రక్రియ కొత్త స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో ప్రతిభను నిలుపుకోవడంలో ఉద్యోగి సౌలభ్యం కీలకం. మార్కెట్లో ఉన్న భారీ డిమాండ్‌తో ఉద్యోగులు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి తలుపులు తెరుస్తోంది.
మూడవ అతిపెద్ద మార్కెట్‌గా..
ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో పెట్టుబడులు వచ్చే రెండేళ్లు ఏటా 33.49 శాతం అధికం అవుతాయి. చాట్‌బోట్స్ వినియోగం పెరుగుతుంది. వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఫిన్‌టెక్ రంగం 2025 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని అంచనా. 2022లో ఐటీ పరిశ్రమ ఏడు శాతం వృద్ధి చెందుతుంది. 2021–22 ద్వితీయార్థం 4,50,000 మంది స్థూల ఉద్యోగుల చేరికను చూసే అవకాశం ఉంది. బిగ్ డేటా అనలిటిక్స్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉండొచ్చు. ఫిన్‌టెక్, రిటైల్, ఈ–కామర్స్, సోషల్ కామర్స్‌లో సేల్స్ నిపుణుల అవసరం అధికం కానుంది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకే ఉత్సాహం చూపుతుండడంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో చిన్న కార్యాలయాల ఏర్పాటు లేదా కో–వర్కింగ్ స్పేస్‌ను వినియోగించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. ఫ్రెషర్ల కోసం నియామకాలు గడిచిన మూడు నెలల్లో పెరిగాయి. ఈ ఏడాది ఇవి మరింత అధికం కానున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment