More Companies Coming Into IPO Amid Ukraine Russia War, యుద్ధంగిద్ధం జాన్తానై! మాకు పైసల్‌ గావాలె? - Sakshi

యుద్ధంగిద్ధం జాన్తానై! మాకు పైసల్‌ గావాలె?

Mar 8 2022 8:23 AM | Updated on Mar 8 2022 10:03 AM

More Companies Coming Into IPO Amid Ukraine Russia War - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌పీఐల అమ్మకాల నేపథ్యంలో సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ మళ్లీ ప్రైమరీ మార్కెట్‌ కళకళలాడే వీలుంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు హెక్సగాన్‌ న్యూట్రిషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు ఐపీవో సన్నాహాలలో భాగంగా ఇండియా ఎక్స్‌పొజిషన్‌ మార్ట్, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సెబీకి దాఖలు చేశాయి. ఈ బాటలో సచిన్‌ బన్సల్‌(ఫ్లిప్‌కార్ట్‌) కంపెనీ నవీ టెక్నాలజీస్‌ సైతం దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా.. 

హెక్సగాన్‌ న్యూట్రిషన్‌ 
న్యూట్రిషన్‌ తయారీలో సమీకృత కార్యకలాపాలు గల హెక్సగాన్‌ న్యూట్రిషన్‌ ఐపీవోకు సెబీ ఓకే చెప్పింది. కంపెనీ డిసెంబర్‌లో దరఖాస్తు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 100 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 600 కోట్లవరకూ సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు తదితరాలకు వినియోగించనుంది. 1993లో ప్రారంభమైన ఈ ముంబై కంపెనీ న్యూట్రిషన్‌ విభాగంలో పెంటాస్యూర్, పెడియాగోల్డ్, ఒబెసిగో తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కలిగి ఉంది.  

ఇండియా ఎక్స్‌పొజిషన్‌ మార్ట్‌ 
సమీకృత ఎగ్జిబిషన్లు, కన్వెన్షన్‌ సెంటర్లను నిర్వహిస్తున్న ఇండియా ఎక్స్‌పొజిషన్‌ మార్ట్‌ ఐపీవోకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.12 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి రూ. 600 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 317 కోట్లను పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. 

సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ 
పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు రియల్టీ రంగ కంపెనీ సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 315 కోట్లను కంపెనీతోపాటు, అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 45 కోట్లను భూమి కొనుగోలు, అభివృద్ధి తదితరాలకు వెచి్చంచనుంది. ప్రస్తుతం ప్రమోటర్‌ గ్రూప్‌నకు కంపెనీలో 95 శాతం వాటా ఉంది. 

నవీ టెక్నాలజీస్‌.. 
సచిన్‌ బన్సల్‌ ఏర్పాటు చేసిన నవీ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి త్వరలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా తాజా ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటివరకూ నవీ టెక్నాలజీస్‌లో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన ప్రమోటర్‌ బన్సల్‌ ఐపీవోలో వాటాలను ఆఫర్‌ చేయకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బన్సల్‌ గతంలో ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు సహవ్యవస్థాపకుడిగా నిలిచిన విషయం విదితమే. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం నవీ టెక్నాలజీస్‌ డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌ ద్వారా రూ. 20 లక్షల వరకూ రుణాలను అందిస్తోంది. రూ. 3,500 కోట్లకుపైగా లెండింగ్‌ బుక్‌ను కలిగి ఉంది.  

చదవండి: క్రూడ్‌ షాక్‌... రూపీ క్రాష్‌!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement