న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, డిజైన్ కంపెనీ సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు గురువారాని(18)కల్లా దాదాపు 33 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ లభించింది. ఐపీవోలో భాగంగా 2,85,63,816 షేర్లను విక్రయానికి ఉంచగా.. 93 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. వెరసి షేరుకి రూ. 209–220 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 840 కోట్లు సమకూర్చుకుంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి 87.6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 17.5 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి.
రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో సైతం 5.5 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఇష్యూలో భాగంగా రూ. 766 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో 33.7 లక్షల షేర్లను వాటాదారులు ఆఫర్ చేశారు. ఇష్యూ ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 252 కోట్లు సమీకరించింది. ఇష్యూ ద్వారా కంపెనీ రెండున్నర నెలల తదుపరి తిరిగి ప్రైమరీ మార్కెట్‌కు జోష్‌ను తీసుకువచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం అంటే మే 24–26 మధ్య ఏథెర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే.
ఐపీవోకు డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ రెడీ
న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసుల అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల(ఆగస్ట్) 24న ప్రారంభంకానున్న ఇష్యూ 26న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఇవి ఇష్యూ తదుపరి చెల్లించిన మూలధనంలో 33 శాతం వాటాకు సమానం. యూనిఫైడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయ సౌకర్యాలను పొందేందుకు డ్రీమ్‌ఫోక్స్ వీలు కల్పిస్తుంది. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు, ఆహారం, పానీయాలు, స్పా, ట్రాన్సిట్ హోటళ్లు తదితర పలు సర్వీసులను పొందేందుకు వినియోగదారులకు కంపెనీ వీలు కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment