సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ దుబాయ్‌లో విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్టు సమాచారం. దుబాయ్‌లోని పామ్ జుమేరాలో బీచ్ ఫ్రంట్ విల్లాను 80 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇదే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఈ డీల్ గురించి తెలిసిన వారు చెబుతున్న మాట.
తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం రూ.640 కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. బీచ్ ఒడ్డున నిర్మించిన ఈ విల్లాలో లేని లగ్జరీ సౌకర్యం అంటూ ఏదీ లేదు. 10 బెడ్‌రూమ్‌లు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్, ఇలా సర్వ హంగులతో 7-స్టార్ హోటల్‌కు మించి ఉంటుందట. దుబాయ్ ప్రాపర్టీ డీల్‌ను అంబానీ ఫ్యామిలీ చాలా గోప్యంగా ఉంచింది. అందుకే కొన్నది ఎవరో చెప్పకుండానే స్థానిక మీడియా కూడా దీని గురించి నివేదించింది.
అలాగే ఈ విల్లా రెనోవేషన్, సెక్యూరిటీ మరింత పటిష్టంగా ఉండేందుకు మిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రిలయన్స్‌కు చెందిన ఆఫ్‌షోర్ ఎంటిటీతోపాటు, గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్, ఎంపీ, దీర్ఘకాల అంబానీ మిత్రుడు పరిమల్నత్వానీ ఈ విల్లా బాధ్యతలు నిర్వహించనున్నారట.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ప్రకారం, ప్రపంచ 11వ బిలియనీర్ అంబానీ 93.3 బిలియన్ల డాలర్ల సంపదకు సంబంధించిన ముగ్గురు వారసుల్లో అనంత్ ఒకరు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్ రంగాలకు విస్తరించిన ముఖేశ్ అంబానీ వ్యాపార పగ్గాలను నెమ్మదిగా వారసులకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ ఇటీవలే టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అలాగే కుమార్తె ఈషా అంబానీకి రిలయన్స్ రీటైల్ బాధ్యతలు, అనంత్‌కు ఎనర్జీ బిజినెస్ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.
కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాలో 80 శాతానికి మించి ప్రవాసీయులే ఉన్నారు. విదేశాలకు చెందిన, ముఖ్యంగా భారతీయులదే అక్కడి రియల్ ఎస్టేట్‌లో అధిక వాటా.దశాబ్దాలుగా అక్కడి ఆర్థికవ్యవస్థకు మూలస్తంభంగా ఉన్నారు. అలాగే ఇటీవల ఇంటిని కొనుగోలు చేసే నిబంధనలు సవరించడం, గోల్డెన్ వీసా ఆఫర్‌తో డిమాండ్ మరింత పెరిగింది. కనీసం 2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన వారికి 10 సంవత్సరాల వీసాను పొందవచ్చు. ఇప్పటికే బ్రిటీష్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తన భార్య విక్టోరియా కోసం, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment