ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సహా అనేక టెక్ కంపెనీలు గత కొన్ని నెలలుగా ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 2001 నాటి గడ్డు పరిస్థితి తాము ఎలా ఎదుర్కొన్నదీ, ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడానికి ఏం చేసిందీ తెలియజేశారు.
ఆ సమయంలో తమ కంపెనీ దాదాపు 1,500 మంది ఫ్రెషర్లకు ఆఫర్లు ఇచ్చిందని మూర్తి చెప్పారు. కానీ పరిస్థితి ప్రతికూలంగా మారడంతో ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ల ప్రకారం వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కంపెనీలో పైస్థాయిలో తామంతా భారీగా జీతాలు తగ్గించుకున్నట్లు మనీ కంట్రోల్ వార్తా సంస్థకు వివరించారు. అప్పట్లో బోర్డు డైరెక్టర్లు అంతా కూర్చుని మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకుని ఆ 1500 మంది ఫ్రెషర్లను అనుకున్నట్లుగా ఆన్‌బోర్డింగ్ చేయగలిగామని గుర్తు చేసుకున్నారు. అలా చేసిన ఏకైక సంస్థ ఇన్ఫోసిస్ అని, ఈ చర్య పట్ల తాను చాలా గర్విస్తున్నానని మూర్తి అన్నారు.
కృత్రిమ మేధతో ముప్పు లేదు
చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ (AI) సాధనాలు మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపవని నారాయణమూర్తి అన్నారు. 1977-78లో కూడా ‘ప్రోగ్రామ్ జనరేటర్’ ఆవిర్భావం సందర్భంగా ఇటువంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. చాట్‌జీపీటీ వంటివి కోడర్(ఉద్యోగి)పై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. మానవ మేధస్సు అత్యంత శక్తివంతమైనదని, దేన్ని అయినా తనకు అనువుగా మలుచుకోగలదని చెప్పారు. మానవులు ఈ కృత్రిమ మేధ సాధనాలను సృజనాత్మకంగా, తెలివిగా వాడుకోగలరని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment