ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు రిజర్వేషన్ ఉండాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తెచ్చిన బిల్లుపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్లు 2024ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీని వల్ల కంపెనీలు రాష్ట్రాన్ని విడిచివెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.
నాస్కామ్ తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం సాంకేతిక రంగంలో ఎంతో వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీలో ఈ రంగం వాటా 25 శాతంగా ఉంది. భారతదేశ డిజిటల్ టాలెంట్‌లో నాలుగింట ఒక వంతు ఇక్కడి నుంచే సమకూరుతుంది. 1,100 స్టార్టప్‌లు స్థానికంగా ఆవిష్కరణలు చేస్తున్నాయి. మొత్తం గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)లో 30 శాతం కర్ణాటకలోనే కొలువు తీరాయి. ప్రభుత్వం తాజాగా స్థానికులకే ఉద్యోగాలు కేటాయించేలా బిల్లు తీసుకొచ్చింది. దాంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, వేరే దేశాలకు చెందినవారు కర్ణాటకలో పనిచేసే పరిస్థితులుండవు. టెక్ కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. భారీగా టెక్నాలజీ ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంలో ఈ బిల్లు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై విస్తృతంగా సమీక్ష జరిపే విరమించుకోవాలి.
కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్లు 2024 ప్రకారం..రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు యాజమాన్య స్థాయిలో 50 శాతం, ఇతర పొజిషన్లలో 75 శాతం రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయించారు. దీనివల్ల సాంకేతిక రంగంలో రాష్ట్రానికి ఉన్న అనుకూల వాతావరణంపై, ప్రతికూల ప్రభావం ఉంటుందని, పరిశ్రమ తిరోగమన బాట పడుతుందన్న పలువురు నిపుణుల హెచ్చరికలకు నాస్కామ్ కూడా గొంతు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఉందని పలు నివేదికలు వెలువడుతున్న తరుణంలో ఇలాంటి బిల్లు విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
ప్రైవేట్ టెక్ కంపెనీల్లో గ్రేడ్ సీ, డీ ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వ్ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు. స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment