కాలగర్భంలో కలల ఉద్యోగం..! | Gen Z are moving away from the traditional notion of a dream job | Sakshi
Sakshi News home page

కాలగర్భంలో కలల ఉద్యోగం..!

Published Mon, Aug 19 2024 1:37 PM | Last Updated on Mon, Aug 19 2024 1:40 PM

Gen Z are moving away from the traditional notion of a dream job

మారుతున్న ‘జెన్‌ జీ’ యువత తీరు

చిన్నపుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్‌?’ అని అడిగితే చాలామంది పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరో లేదా ప్రపంచంలోని టాప్‌ టెక్‌ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని చెప్పేవారు. అదే డ్రీమ్‌ జాబ్‌గా ఊహించుకుని కష్టపడి చదివి ఏదో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరినవారు కూడా ఉన్నారు. అయితే మారుతున్న జీవన శైలి, టెక్‌ కంపెనీలో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ‘జెన్‌ జీ’(1997-2005 మధ్య జన్మించిన వారు) యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.

కొవిడ్‌ సమయంలో ఐటీ కంపెనీల రెవెన్యూ గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల జీతాలకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాంతో కరోనా కాలంలో అదే అదనుగా లేఆఫ్స్‌ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించారు. ‘జెన్‌ జీ’ యువతకు కొత్తగా టెక్‌ జాబ్స్‌ సంపాదించడం సవాలుగా మారింది. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఆఫర్‌లేటర్‌ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ‘డ్రీమ్‌జాబ్‌’ ఊహ నుంచి క్రమంగా బయటకొచ్చి ఇతర ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతోపాటు ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచుతున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1064 ప్రధాన కంపెనీలు 1,65,269 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించాయి. 2023లో 1193 సంస్థల నుంచి 2,64,220 మంది టెకీలు, 2024లో ఇప్పటి వరకు 398 కంపెనీల్లో 1,30,482 మంది సాఫ్ట్‌వేర్లను ఇంటికి పంపించాయి. వర్క్‌ఫ్రమ్‌ హోం ఇస్తున్నామనే ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు నియమాలకంటే ఎక్కువసేపు పని చేయిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు ఉద్యోగార్థులు తమ చిన్నప్పటి ‘డ్రీమ్‌జాబ్‌’కు స్వస్తి పలుకుతున్నారు.

ఇదీ చదవండి: ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలు

ఇప్పటికే టెక్‌ కంపెనీల్లో పనిచేస్తున్న 51 శాతం ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు, పిల్లల చదువుల కోసం, వారితో సమయం గడుపుతూ మెరుగైన భవిష్యత్తు అందించేందుకు వేరే కొలువులవైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా 19 శాతం జెన్‌ జీ ఉద్యోగులు తన ‘డ్రీమ్‌జాబ్‌’ను నెరవేర్చుకునేందుకు టాప్‌ కంపెనీలను ఎంచుకుంటున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఏదేమైనా సరైన నైపుణ్యాలున్న వారికి ఏ కంపెనీలోనైనా కొలువు సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో డిమాండ్‌ ఉండే కోర్సులు నెర్చుకుని అందులో అడ్వాన్స్‌డ్‌ స్కిల్స్‌ సంపాదిస్తే ఉద్యోగం ఖాయం. వృత్తి జీవితం వేరు. వ్యక్తిగత జీవితం వేరు. రెండింటిని బ్యాలెన్స్‌ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పాటించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement