ఐటీ రంగంలో పరిస్థితులు ఇంకా మెరుగైనట్లు కనిపించడం లేదు. లేఆఫ్‌ల భయం ఉద్యోగులను ఇంకా వీడలేదు. గడిచిన జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లోనూ గణనీయ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు.
ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు జూలై నెలలోనూ కొనసాగాయి. విదేశాలలోపాటు, భారత్‌లోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గత నెలలో మొత్తంగా దాదాపు 8000 మంది ఉద్యోగాలు కోల్పోగా భారత్‌లో 600 మంది ఉద్వాసనకు గురయ్యారు. జూన్‌తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభావం గణనీయంగానే ఉంది.
జూలైలో ప్రధాన తొలగింపులు ఇవే
మసాచుసెట్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యూకేజీ (UKG) తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తొలగించింది. మొత్తం 2,200 మంది ఇంటి బాట పట్టారు. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్‌ట్యూట్ (Intuit Inc.) కార్యకలాపాల క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 10% మంది అంటే 1,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.
సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఓపెన్ టెక్స్ట్, రెడ్‌బాక్స్ కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అవి వరుసగా 1,200, 100 ఉద్యోగాలను తగ్గించాయి. భారతీయ ఎడ్‌టెక్ దిగ్గజం అన్‌కాడెమీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 100 మంది మార్కెటింగ్, బిజినెస్, ప్రొడక్షన్ ఉద్యోగులను, 150 మంది సేల్స్ సిబ్బందిని మొత్తంగా 250 మందిని తొలగించింది.
చెన్నైకి చెందిన అగ్రిటెక్ సంస్థ వేకూల్ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా బెంగళూరు ఆధారిత ఆడియో సిరీస్ ప్లాట్‌ఫారమ్ పాకెట్‌ఎఫ్‌ఎం దాదాపు 200 మంది రైటర్లను తొలగించింది. ఇక ‘ఎక్స్’కి పోటీగా వచ్చిన భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ (Koo) డైలీహంట్‌తో కొనుగోలు చర్చలు విఫలమవడంతో మూతపడింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది.
Comments
Please login to add a commentAdd a comment