న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌టీ) కొంత ఊరట లభించింది. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియను (సీఐఆర్‌పీ) ముగించేందుకు గడువును ఎన్‌సీఎల్‌టీ మరో 60 రోజుల పాటు పెంచింది. పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) దివాకర్ మహేశ్వరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గో ఫస్ట్‌పై మూడు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు, ధరావత్తును కూడా డిపాజిట్ చేసినట్లు మహేశ్వరి తెలిపారు.
దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్, షార్జాకి చెందిన స్కై వన్, ఆఫ్రికన్ సంస్థ సాఫ్రిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ వీటిలో ఉన్నాయి. ఇవి త్వరలోనే తమ ప్రణాళికలను సమర్పించే అవకాశం ఉందని మహేశ్వరి పేర్కొన్నారు. గో ఫస్ట్ గతేడాది మే 3 నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరుతూ మే 10న ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. గో ఫస్ట్ దివాలా పరిష్కార ప్రక్రియ డెడ్‌లైన్‌ను ఎన్‌సీఎల్‌టీ పొడిగించడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్ 23న 90 రోజుల పాటు పొడిగించగా.. ఆ డెడ్‌లైన్ ఫిబ్రవరి 4తో ముగిసింది. దివాలా కోడ్ కింద సీఐఆర్‌పీని గరిష్టంగా 330 రోజుల్లోగా పూర్తి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment