ప్ర. నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. రిటైర్మెంట్ సందర్భంలో అన్నీ కలిపి రూ. 1 కోటి వచ్చింది. ఆ మొత్తం బ్యాంకులో జమయింది. అందులో నుంచి రూ. 84 లక్షలతో హైదరాబాద్‌లో ఒక ఫ్లాటు కొన్నాను. డాక్యుమెంట్‌లో నా పేరు, నా భార్య పేరు, నా కుమారుడి పేరు రాయించి, రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ ఇంట్లోనే మేము ఉంటున్నాము. నా భార్యకు ఎటువంటి ఆదాయం లేదు. పాన్ ఉంది. మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కేవలం జీతమే ఉంది. 2022 మార్చి 31 నాటికి రిటర్ను వేస్తే నోటీసు వచ్చింది. అందులో ఈ ఫ్లాటు కొన్నట్లుంది. వివరణ అడుగుతున్నారు. ఏం చేయాలి?
జ. ఫారం 26 ఏఎస్‌లో ఉన్న సమాచారాన్ని డిపార్టుమెంటు వాళ్లు ఎనిమిది రకాల సంస్థల నుండి సేకరిస్తారు. ఈ సంస్థలు ప్రతి సంవత్సరం వారి దగ్గర వ్యవహారాలను డిపార్టుమెంటుకి తెలియజేస్తారు. ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఇలా వారి దగ్గర జరిగిన క్రయవిక్రయాల వివరాలు .. స్థిరాస్తి వివరాలు, అమ్మిన తేదీ, విలువ, అమ్మకందారు వివరాలు, కొన్న వ్యక్తి వివరాలు మొదలైనవి తెలియజేస్తారు. డిపార్టుమెంటు వారు అటు అమ్మిన వ్యక్తికి, ఇటు కొన్న వ్యక్తికి నోటీసులు పంపిస్తారు. ఫారం 26ఏఎస్, ఫారం ఏఐఎస్ .. రెండూ వెబ్‌సైటులో ఉంటాయి. నిజానికి మీరు రిటర్ను దాఖలు చేసినప్పుడు ఫారం 16, 16ఏ ఇతర డాక్యుమెంట్లతో పాటు ఈ రెండూ చూడాలి. ఈ స్టేట్‌మెంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు జరిపిన వ్యవహారాలు ఉంటాయి. ఇదొక చిట్టా. డైరీలాంటిది. గడిచిన వైభవం. గడిచిన వైనం.
ఇక మీ కేసులో మీకు మీ రిటైర్మెంటు సందర్భంలో వచ్చిన మొత్తాల మీద ఎటువంటి పన్నుభారం ఉండదు. కానీ రిటర్ను వేసేటప్పుడు ఒక కాలంలో ఇటువంటి మినహాయింపు ఉన్న అంశాలను ప్రస్తావించాలి. వాటిలో ఇటువంటి వాటి గురించి రాయాలి. అలా రాసినప్పుడు మీరు వివరణ సులువుగా ఇవ్వొచ్చు. స్థిరాస్తుల క్రయంలో.. అంటే కొనేటప్పుడు కుటుంబ సభ్యుల పేరు రాసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షలు లేవు. అభ్యంతరం లేదు. డబ్బులు మీవి అయినా మీరు కాగితాల్లో మీ శ్రీమతి గారి పేరు, మీ అబ్బాయి పేరు రాసుకోవచ్చు. వివరణ ఇవ్వక్కర్లేదు. సెంటిమెంటల్ కానివ్వండి, లో లోపల ఒప్పందం కానివ్వండి, కుటుంబపు మర్యాద అనండి, ముందు చూపు అనుకోండి, సౌల భ్యం అనుకోండి, సమస్య లేకుండా అనుకోండి, అవాంతరాలు లేకుండా అనుకోండి. ఇలా ఏ కారణమయినా ఫర్వాలేదు. ఇది సమస్య కాదు.
వ్యవహారం జరిగిందా లేదా? ఎంతకు కొన్నారు? ఎవరి దగ్గర్నుంచి కొన్నారు? విలువ ఎంత? అది ఎలా చెల్లించారు? ఆ చెల్లింపులకు ‘‘సోర్స్’’ ఏమిటి? మీ అబ్బాయికి నోటీసు వచ్చినా.. మీ అబ్బాయిని వివరణ అడిగినా ఏం గాభరా పడక్కర్లేదు. రూ. 84 లక్షల కొనుగోలుకి ‘‘సోర్స్’’ ఉందంటున్నారు. బ్యాంకు అకౌంటులో ముందుగా క్రమంగా ‘‘సోర్స్’’ జమ అయి ఉండాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డెబిట్లు.. లేదా ఖర్చుల పద్దులు ఉండాలి. నేను కొన్నాను అని, జాయింటు కొనుగోలుదార్లలో ఒకరినని.. పెట్టుబడి మాత్రం.. ‘‘సోర్స్’’ మాత్రం మా నాన్నగారిదని కాగితాలతో సహా జతపర్చి జవాబు ఇస్తే సరిపోతుంది.
చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!
Comments
Please login to add a commentAdd a comment