
బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ రెండవ ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని, మొదటి సారి తలెత్తిన సమస్యలేవీ ఇప్పుడు ఎదురుకాలేదని కంపెనీ తెలిపింది.
న్యూరాలింక్ మొదటి ఇంప్లాంట్‌ను నోలాండ్ అర్బాగ్ అనే వ్యక్తికి గత జనవరిలో అమర్చారు. అయితే శస్త్రచికిత్స తర్వాత ఇంప్లాంట్‌కు సంబంధించిన అత్యంత సూక్ష్మమైన ఎలక్ట్రోడ్ వైర్లు మెదడు నుంచి బయటకు వచ్చాశాయి. ఫలితంగా మెదడు సంకేతాలను అంచనా వేయడంలో సమస్య ఏర్పడింది. తర్వాత దీన్ని పరిష్కరించినట్లు న్యూరాలింక్ పేర్కొంది. కాగా జంతువులపై నిర్వహించిన ట్రయల్స్‌లోనే న్యూరాలింక్‌కు ఈ సమస్య గురించి తెలుసని రాయిటర్స్ నివేదించింది.
ఇలాంటి సమస్య రెండవ రోగిలో పునరావృతం కాకుండా నివారించడానికి శస్త్రచికిత్స సమయంలో మెదడు కదలికను తగ్గించడంతోపాటు ఇంప్లాంట్, మెదడు ఉపరితలం మధ్య గ్యాప్‌ను తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. రెండవ రోగికి న్యూరాలింక్ ఈ పరికరాన్ని విజయవంతంగా అమర్చింది. వీడియో గేమ్‌లు ఆడటానికి, త్రీడీ వస్తువులను ఎలా రూపొందించాలో తెలుసుకోవడానికి ఈ బ్రెయిన్ చిప్‌ను ఆ వ్యక్తి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment