నెపానగర్ (మధ్యప్రదేశ్): ప్రభుత్వరంగ న్యూస్ ప్రింట్ తయారీ సంస్థ అయిన ‘నెపా లిమిటెడ్’ ఆరేళ్ల విరామం తర్వాత తయారీ కార్యకలాపాలను మంగళవారం ప్రారంభించింది. తయారీ సామర్థ్యాన్ని లక్ష టన్నులకు (వార్షిక) పెంచింది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దీన్ని ప్రారంభించారు.
సంవత్సరానికి 1 లక్ష టన్నుల మెరుగైన ఉత్పత్తి సామర్థ్యంతో పునఃప్రారంభం కానున్న ఈ కేంద్రం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. న్యూస్‌ప్రింట్‌లో దేశ స్వయం సమృద్ధికి ఈ ప్లాంట్ దోహదపడుతుందని చెప్పారు. 2018 అక్టోబర్‌లో రూ.469 కోట్లతో ఈ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.395 కోట్ల టర్నోవర్ సాధిస్తామని నెపా చైర్మన్, ఎండీ సౌరభ్‌దేవ్ తెలిపారు. 2023–24లో రూ.554 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటామన్నారు. మూతబడడానికి ముందు 2015-16లో నెపా టర్నోవర్ రూ.72 కోట్లుగా ఉంది. న్యూస్‌ప్రింట్‌తో పాటు రైటింగ్, ప్రింటింగ్ పేపర్ ముద్రించడంలో కూడా విస్తరించాలని యోచిస్తోంది. కాగా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభంతో 1956 ఏప్రిల్ 26న, భారతదేశ మొదటి ప్రధానమంత్రి దివంగత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ మిల్లును జాతికి అంకితం చేశారు. అయితే 2016లో మూతపడింది.
Comments
Please login to add a commentAdd a comment