
ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై రెండోరోజూ కొనసాగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం నష్టాలను చవిచూశాయి. ఉదయం సెన్సెక్స్ 40 పాయింట్ల స్వల్ప లాభంతో 65,728 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల పెరిగి 19,554 వద్ద మొదలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రోజంతా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులు, పారిశ్రామిక షేర్లు మినహా అన్ని రంగాలూ అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 414 పాయింట్లు నష్టపోయి 65,274 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు క్షీణించి 19,413 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి సెన్సెక్స్ 366 పాయింట్ల నష్టపోయి 65,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 19,428 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.13 %, స్మాల్ క్యాప్ సూచీ 0.31 శాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,073 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.500 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 82.85 స్థాయి వద్ద స్థిరపడింది. కాగా ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 399 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
‘‘వ్యవస్థలోకి వచ్చిన అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఆర్‌బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్‌ను పదిశాతం పెంపు చర్యలతో స్టాక్ మార్కెట్ రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ద్రవ్యోల్బణ అంచనా పెంపుతో ఆందోళనలు మరింత అధికమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు తగ్గట్లే నమోదైంది. బ్రిటన్ జీడీపీ డేటా అంచనాలకు మించి నమోదైంది. అయినప్పటికీ అంతర్జాతీయ సెంటిమెంట్ బలహీనంగా ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►జూన్ క్వార్టర్‌లో నికరలాభం 14 రెట్లు పెరగడంతో ఎల్‌ఐసీ షేరు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 3% లాభపడి రూ.660 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.677 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
► ఎంఎస్‌సీఐ ఇండియా సూచీలో చోటు దక్కించుకున్న సుప్రీం ఇండస్ట్రీస్(6%), ఆర్‌ఈసీ(4%), అశోక్ లేలాండ్(0.50%) షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. కాగా ఇదే ఇండెక్స్ నుంచి స్థానం కోల్పోయిన ఏసీసీ షేరు స్వల్పంగా 0.25% కోల్పోయి రూ.1955 వద్ద స్థిరపడింది. అస్ట్రాల్, కమ్మిన్స్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పవర్ ఫైనాన్స్ కార్పొరేట్‌లు సైతం ఇండెక్సులో చేరనున్నాయి.