ముంబై : దేశీయ స్టాక్ సూచీలు కొత్త ఏడాది తొలి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ సోమవారం 327 పాయింట్లు బలపడి 61,168 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 18,200 పాయింట్లు చేరువలో 18,197 వద్ద నిలిచింది. నూతన సంవత్సరం నేపథ్యంలో పలు దేశాల స్టాక్ మార్కెట్లకు సెలవు కారణంగా సూచీలు ఉదయం ప్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
తొలుత కాస్త తడిబడినా.., మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా లాభాల బాటపట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 61,222 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు బలపడి 18,215 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. గతేడాది చివరి నెల డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
ఆటో కంపెనీల అమ్మకాలు అంచనాలకు తగ్గట్టు నమోదయ్యాయి. కొత్త వ్యాపారాల ఆర్డర్లలతో తయారీ రంగ పీఎంఐ సూచీ 13 నెలల గరిష్టానికి చేరుకుంది. ఈ సానుకూల పరిణామాలు సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, విద్యుత్ రంగాల షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, మిడ్ క్యాప్ సూచీ అరశాతం లాభపడ్డాయి. సూచీలు అరశాతం ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లో రూ.1.47 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.213 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.743 కోట్ల షేర్లు కొన్నారు.
కొత్త ఏడాది సందర్భంగా జపాన్, సింగపూర్, హాంగ్‌కాంగ్, థాయిలాండ్, చైనా, బ్రిటన్‌తో పాటు అమెరికా మార్కెట్లు పని చేయలేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుదల, దేశీయ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహరణతో డాలర్ మారకంలో రూపాయి విలువ 17 పైసలు క్షీణించి 82.78 స్థాయి వద్ద స్థిరపడింది. ‘దేశీయ కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి నమోదవ్వొచ్చనే అంచనాలతో పాటు బడ్జెట్‌పై ఆశలతో రానున్న రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ స్థిరంగా రాణించవచ్చు. నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,250 పాయింట్లను ఛేదించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 18,100 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► డిమాండ్ పెంచేందుకు చైనా ఎగుమతుల సుంకాన్ని పెంచడంతో పాటు కోవిడ్ ఆంక్షల ఎత్తివేతతో మెటల్ షేర్లు మెరిశాయి. సెయిల్, హిందుస్థాన్ కాపర్, మొయిల్, జేఎస్‌ఎల్, టాటా స్టీల్ షేర్లు 8% నుంచి 7% ర్యాలీ చేశాయి. నాల్కో, హిందాల్కో, వేదాంత, రత్నమణి మెటల్స్, జిందాల్ స్టీల్, ఏపియల్ అపోలో షేర్లు, హిందుస్థాన్ జింక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు 4–1% చొప్పు న రాణించాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఇంట్రాడేలో 3% ఎగసి 6907 స్థాయి వద్ద జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది.
► రెండోరోజు నాటికి షా పాలీమర్స్ ఐపీఓ 2.37 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 56.10 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 1.33 లక్షల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి.
► ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నాట్కో ఫార్మా, దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, ఇప్కా ల్యాబ్స్, ఫైజర్, లారస్ ల్యాబ్స్ సన్ ఫార్మా షేర్లు 1.50% నుంచి ఒకశాతం నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment