BSEB
-
బడ్జెట్ ఎఫెక్ట్ : నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
పలు జాతీయ అంతర్జాతీయ అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సింగపూర్ స్టాక్ ఎక్ఛేంజ్ నిఫ్టీ (ఎస్‌జీఎక్స్) నిరాశజనకంగా కొనసాగుతుంటే..వచ్చే వారం ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో యూఎస్ మార్కెట్లో ఓవర్‌నైట్ ట్రేడ్‌లో మిక్స్డ్ ఫలితాలు వెలువరించాయి. దీనికి తోడు దేశీయంగా ప్రస్తుత నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ గడువు ఈరోజు ముగియనుండడంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను మార్చుకునేందుకు మక్కువ చూపడం, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో దేశ ప్రజల చూపంతా ఈ బడ్జెట్ వైపే ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతున్నారు. బుధవారం ఉదయం 9.37గంటలకు సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 60697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95.25 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్,హిందాల్కో,బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం,టాటా మోటార్స్,హెచ్‌యూఎస్,ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అదానీ పోర్ట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్,అపోలో హాస్పిటల్స్,ఎస్బీఐ, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
బీఎస్ఈ సీఈవోగా సుందరరామన్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈకి ఎండీ, సీఈవోగా సుందరరామన్ రామమూర్తి ఎంపికయ్యారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రామమూర్తి ఎంపికకు గత నెలలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు బీఎస్ఈ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ను రామమూర్తి ఆమోదించవలసి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్ఈ గత ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ గతేడాది(2022) జూలైలో పదని నుంచి తప్పుకుని మరో దిగ్గజ స్టాక్ ఎక్ఛేంజీ ఎన్ఎస్ఈకి తరలి వెళ్లారు. దీంతో ఎన్ఎస్ఈలో సభ్యులుగా వ్యవహరించిన రామమూర్తికి బీఎస్ఈ అత్యున్నత పదవిని ఆఫర్ చేసింది. -
సూచీలకు స్వల్ప లాభాలు
ముంబై: ఆద్యంతం లాభ, నష్టాల మధ్య కదలాడిన స్టాక్ సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 61,294 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 18,233 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. ఒక దశలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయితే చివరి గంట కొనుగోళ్లతో ఇంట్రాడే గరిష్టం వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 93 పాయింట్ల నష్టంతో 61,075 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 339 పాయింట్ల పరిధిలో 61,004 వద్ద కనిష్టాన్ని, 61,344 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 18,163 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 18,150 – 18,252 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. కమోడిటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22%, స్మాల్ క్యాప్ సూచీ 0.18 శాతం పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.628 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.351 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. డాలర్ మారకంలో 22 పైసలు పతనమై 83.00 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జొమాటో సహ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పాటిదార్ రాజీనామాతో కంపెనీ షేరు 2 శాతం నష్టపోయి రూ.58.90 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగుశాతానికి పైగా నష్టపోయి రూ.57.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ► స్వల్ప శ్రేణి ట్రేడింగ్‌లోనూ బీమా కంపెనీల షేర్లకు డిమాండ్ లభించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 4.50%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 4%, ఎల్ఐసీ 3.50%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రెండుశాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్డీటీవీ వాటాదారులకు జోష్ ఎన్డీటీవీ వాటాదారులకు బోనస్‌లాంటి వార్త. ఇటీవలే ఎన్డీటీవీని చేజిక్కించుకున్న అదానీ గ్రూప్.. మీడియా సంస్థ వాటాదారులకు షేరుకి రూ. 48.65 చొప్పున అదనంగా చెల్లించేందుకు నిర్ణయించింది. ఓపెన్ ఆఫర్లో భాగంగా నవంబర్ 22 నుంచి డిసెంబర్ 5 మధ్య షేర్లను టెండర్ చేసిన ఎన్డీటీవీ వాటాదారులకు తాజా చెల్లింపు వర్తించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమై వెనువెంటనే లాభాల్లో పయనించాయి. ఉదయం 9.48గంటల సమయంలో సెన్సెక్స్ 15పాయింట్ల లాభంతో 61182 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 4 పాయింట్ల అత్యంత స్వల్ప లాభంతో 18202 వద్ద కొనసాగుతుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా,బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్,కోల్ ఇండియా, బ్రిటానియా,టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
కొత్త ఏడాది లాభాల బోణీ
ముంబై : దేశీయ స్టాక్ సూచీలు కొత్త ఏడాది తొలి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ సోమవారం 327 పాయింట్లు బలపడి 61,168 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 18,200 పాయింట్లు చేరువలో 18,197 వద్ద నిలిచింది. నూతన సంవత్సరం నేపథ్యంలో పలు దేశాల స్టాక్ మార్కెట్లకు సెలవు కారణంగా సూచీలు ఉదయం ప్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలుత కాస్త తడిబడినా.., మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా లాభాల బాటపట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 61,222 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు బలపడి 18,215 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. గతేడాది చివరి నెల డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఆటో కంపెనీల అమ్మకాలు అంచనాలకు తగ్గట్టు నమోదయ్యాయి. కొత్త వ్యాపారాల ఆర్డర్లలతో తయారీ రంగ పీఎంఐ సూచీ 13 నెలల గరిష్టానికి చేరుకుంది. ఈ సానుకూల పరిణామాలు సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, విద్యుత్ రంగాల షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, మిడ్ క్యాప్ సూచీ అరశాతం లాభపడ్డాయి. సూచీలు అరశాతం ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లో రూ.1.47 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.213 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.743 కోట్ల షేర్లు కొన్నారు. కొత్త ఏడాది సందర్భంగా జపాన్, సింగపూర్, హాంగ్‌కాంగ్, థాయిలాండ్, చైనా, బ్రిటన్‌తో పాటు అమెరికా మార్కెట్లు పని చేయలేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుదల, దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణతో డాలర్ మారకంలో రూపాయి విలువ 17 పైసలు క్షీణించి 82.78 స్థాయి వద్ద స్థిరపడింది. ‘దేశీయ కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి నమోదవ్వొచ్చనే అంచనాలతో పాటు బడ్జెట్‌పై ఆశలతో రానున్న రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ స్థిరంగా రాణించవచ్చు. నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,250 పాయింట్లను ఛేదించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 18,100 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► డిమాండ్ పెంచేందుకు చైనా ఎగుమతుల సుంకాన్ని పెంచడంతో పాటు కోవిడ్ ఆంక్షల ఎత్తివేతతో మెటల్ షేర్లు మెరిశాయి. సెయిల్, హిందుస్థాన్ కాపర్, మొయిల్, జేఎస్‌ఎల్, టాటా స్టీల్ షేర్లు 8% నుంచి 7% ర్యాలీ చేశాయి. నాల్కో, హిందాల్కో, వేదాంత, రత్నమణి మెటల్స్, జిందాల్ స్టీల్, ఏపియల్ అపోలో షేర్లు, హిందుస్థాన్ జింక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు 4–1% చొప్పు న రాణించాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఇంట్రాడేలో 3% ఎగసి 6907 స్థాయి వద్ద జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. ► రెండోరోజు నాటికి షా పాలీమర్స్ ఐపీఓ 2.37 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 56.10 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 1.33 లక్షల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ► ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నాట్కో ఫార్మా, దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, ఇప్కా ల్యాబ్స్, ఫైజర్, లారస్ ల్యాబ్స్ సన్ ఫార్మా షేర్లు 1.50% నుంచి ఒకశాతం నష్టపోయాయి. -
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది ప్రారంభ రోజు ఫ్లాటుగా ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. నిఫ్టీ 18100 పాయింట్లకు పైకి ఎగబాకింది.సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 60,959 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 18,145 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. కానీ కొద్ది సేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 60798 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ అత్యల్పంగా 9 పాయింట్లు నష్టాలవైపు పయనమవుతున్నాయి. నిఫ్టీ -50లో టాటా స్టీల్, హిందాల్కో, టాటామోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఎస్బీఐలు నష్టాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ -50లో టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్,ఓఎన్జీసీ,బీపీసీఎల్ షేర్లు లాభాల వైపు మొగ్గుచూపుతున్నాయి. -
2022కు నష్టాలతో వీడ్కోలు
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ 2022 ఏడాదిని నష్టాలతో ముగించింది. ఇన్వెస్టర్లు ఏడాది చివరి ట్రేడింగ్ రోజు కావడంతో అప్రమత్తంగా వ్యవహరించారు. మాంద్యం భయాలు తెరపైకి వస్తున్న తరుణంలో కొత్త ఏడాది అవుట్‌లుక్‌పై ఆందోళనకు గురయ్యారు. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో శుక్రవారం ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 61,329 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 18,259 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్లో లాభాలతో కదలాడిన సూచీలు యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో క్రమంగా నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా చివరి గంటలో బ్యాంకింగ్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 293 పాయింట్లు నష్టపోయి 60,841 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 86 పాయింట్లు పతనమై 18,105 వద్ద నిలిచింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, రియల్టీ షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,951 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,266 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 82.73 స్థాయి వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో దేశీ కరెన్సీ డాలర్ మారకంలో ఏకంగా 11.36% (844 పైసలు) క్షీణించింది. స్టాక్ మార్కెట్‌కు కలిసిరాని 2022... స్టాక్ మార్కెట్‌కు ఈ ఏడాది(2022) కలిసిరాలేదు. గతేడాది(2021) ఏకంగా 22% రాబడినిచ్చిన దలాల్ స్ట్రీట్ ఈ క్యాలెండర్ సంవత్సరంలో కేవలం నాలుగున్నర శాతం స్వల్పలాభంతో సరిపెట్టింది. సెన్సెక్స్ 2,586 పాయింట్లు (4.44%), నిఫ్టీ 751 పాయింట్లు(4.32%) చొప్పున ఆర్జించాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం హెచ్చరికల భయాలు మార్కెట్ ఆస్థిరతకు కారణమయ్యాయి. ఇదే ఏడాదిలో స్టాక్ మార్కెట్లో రూ.16.45 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన సెన్సెక్స్ 63,583 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,888 పాయింట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫిబ్రవరి 15న అత్యధికంగా లాభపడగా.. ఫిబ్రవరి 24న అత్యధిక నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీగా ర్యాలీ చేయగా, ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లిస్టింగ్ రోజే ఎలీన్ ఎలక్ట్రానిక్స్ డీలా ఎలీన్ ఎలక్ట్రానిక్స్ షేరు లిస్టింగ్ రోజే నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.247)తో పోలిస్తే ఒకటిన్నర శాతం నష్టంతో రూ.244 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఎనిమిదిన్నర శాతం క్షీణించి రూ.226 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆఖరికి 8% నష్టంతో రూ.228 వద్ద స్థిరపడింది. క్రాఫ్ట్‌మెన్ ఆటోమిషన్ షేరు 14% ర్యాలీ చేసి రూ.3710 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. డాక్టర్ యాక్సిన్ ఇండియాను రూ.375 కోట్లకు చేజిక్కించుకోవడంతో ఈ షేరుకు డిమాండ్ లభించింది. చివర్లో కొంత లాభాల స్వీకరణ జరగడంతో 8% శాతం లాభంతో రూ.3,507 వద్ద స్థిరపడింది. హరియాణాలో రూ.624 కోట్ల రోడ్డు ప్రాజెక్ట్ దక్కడంతో హెజీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ 7% బలపడి రూ.616 వద్ద స్థిరపడింది. -
డాలర్‌పై ఒత్తిడి.. లాభాల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు
ఈ ఏడాది ట్రేడింగ్ చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనాలో కరోనా కేసుల కారణంగా క్రూడాయిల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందనే అంచనాలతో చమురు దిగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో డాలర్‌పై ఒత్తిడి పెరిగింది. డాలర్ విలువ స్థిరంగా కొనసాగుతుండగా రూపాయి పుంజుకుంది. దీనికి తోడు మదుపర్లు ఫ్యూచర్స్ - ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ఒప్పందాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతం ఇచ్చాయి. వెరసి శుక్రవారం ఉదయం 10 .30 గంటల సమయానికి దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు లాభ పడి 61265 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 18233 వద్ద ట్రేడింగ్‌ను కంటిన్యూ చేస్తుంది. హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఎథేర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఏసియేషన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
స్టాక్ మార్కెట్లలో బుల్ జోష్..కొనసాగుతున్న లాభాల పరంపర
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలను గడించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఊగిలాటతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి. అయితే చివరి గంటలో టెలికం, బ్యాంకింగ్, మెటల్ షేర్లు రాణించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల గడువు గురువారం ముగిస్తుండటంతో ట్రేడర్లు తమ పొజిషన్లను షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. చైనాలో కరోనా కేసుల కారణంగా క్రూడాయిల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందనే అంచనాలతో ధరలు క్షీణించడం మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇంట్రాడేలో 732 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 224 పాయింట్లు లాభపడి 61,134 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 237 పాయింట్ల శ్రేణిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసేసరికి 68 పాయింట్లు పెరిగి 18,191 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్లను విక్రయించాయి. చైనా బీజింగ్‌లో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కేఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ అంతంతే ఆర్థిక సేవల ప్లాట్‌ఫాం కెఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.366)తో పోలిస్తే ఒకశాతం ప్రీమియంతో రూ.369 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.372 వద్ద గరిష్టాన్ని, రూ.351 కనిష్టాన్ని తాకింది. చివరికి అరశాతం నష్టంతో రూ.364 వద్ద స్థిరపడింది. -
స్టాక్ మార్కెట్లో ఊగిసలాట.. లాభనష్టాల మధ్య సూచీలు
కోవిడ్ భయాలతో అమ్మకాల ఒత్తిడికి లోనైన దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారం ప్రారంభంతో క్రిస్మస్ పండుగ తర్వాత రోజు స్టాక్ మార్కెట్లో శాంటాక్లాజ్ ర్యాలీతో లాభాలు గడించాయి. ఆ మరుసటి రోజు అంటే ఇవాళ కోవిడ్‌తో పాటు ఇతర అంతర్జాతీయ అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మంగళవారం ఉదయం 10.30గంటల సమయానికి లాభానష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 60593 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 18027 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ, టాటా కాన్స్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, యూపీఎల్ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. గతవారం చైనాతో పాటు పలుదేశాల కోవిడ్ కేసుల నమోదు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. అయితే ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిపుణుల అంచనాలకు అనుగుణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 258 పాయింట్ల స్వల్పలాభంతో 60103 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప లాభంతో 17883 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇక హెచ్‌యూఎల్,నెస్లే, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏసియన్ పెయింట్స్, ఎయిర్టెల్, టాటా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఇండస్‌ఎండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో పుంజుకుంటున్నాయి. -
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్-19, భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వారంలో వరుస నాలుగో రోజు జాతీయ, అంతర్జాతయ స్థాయిలో నెలకొన్న ప్రతికూల అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో శుక్రవారం స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేలా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపును కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన మదుపర్లు వాల్ స్ట్రీట్‌లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఏసియన్ మార్కెట్లు సైతం నష్టాల బాట పట్టాయి. చైనాలో కరోనా విజృంభిస్తోంది. కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్7(BF.7) కారణమని నిపుణులు అభిప్రాయం చేస్తున్నారు. దీనికి తోడు ఈ కొత్త 4 వేరియంట్ కేసులు భారత్‌లో నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్‌ను వ్యాప్తిని అరికట్టేలా జాగ్రత్తలు చెబుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఎత్తున నష్టపోతున్నాయి. శుక్రవారం ఉదయం 10.5గంటల సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లతో భారీగా నష్టపోయి 60288 వద్ద.. నిఫ్టీ 167 పాయింట్లు నష్టపోయి 17959 వద్ద కొనసాగుతుంది. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కోవిడ్ -19 వ్యాప్తి వార్తల నేపథ్యంలో దివిస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
రెపోరేట్లు పెంచిన ఆర్బీఐ, నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో దేశీయ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. రెపోరేట్ల పెంపు, కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తోపాటు 8న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం 11 గంటలకు సెన్సెక్స్ 184 పాయింట్లు నష్టపోయి 62441 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 18575 వద్ద కొనసాగుతుంది. ఇక బజాజ్ ఫిన్ సర్వ్,ఎన్టీపీసీ, టాటా మోటార్స్,యూపీఎల్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టాల్లో కొనసాతుంటే.. బీపీసీఎల్,లార్సెన్, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా కాన్స్, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
రూపాయి పతనం, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 208 పాయింట్లు క్షీణించి 62,626 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 58 పాయింట్ల వెనకడుగుతో 18,643 వద్ద స్థిరపడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 445 పాయింట్లు పతనమై 62,390ను తాకగా.. నిఫ్టీ 123 పాయింట్లు నీరసించి 18,578 దిగువకు చేరింది. చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్లు బలహీనపడటం, రూపాయి పతనం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ వీక్..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ 1.5 శాతం నష్టపోగా.. మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్ 1–0.5 శాతం మధ్య డీలా పడ్డాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్ 1.25 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, హిందాల్కో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్, ఐషర్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్ 3–1.3 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో అదానీ, హెచ్‌యూఎల్, నెస్లే, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, గ్రాసిమ్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ 2.5–0.5 శాతం మధ్య లాభపడ్డాయి. చిన్న షేర్లు సైతం..: మార్కెట్ల బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,936 నష్టపోగా.. 1,563 పుంజుకున్నాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 635 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 559 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. సోమవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. స్టాక్ హైలైట్స్ ► రానున్న ఐదేళ్లలో అమ్మకాలను మూడు రెట్లు పెంచుకునే ప్రణాళికలు ప్రకటించడంతో వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ షేరు 6 శాతం జంప్‌చేసింది. రూ. 782 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 815ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ► విభిన్న సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 400 కోట్ల సమీకరణ అంశంపై వారాంతాన సమావేశంకానున్నట్లు వెల్లడించడంతో ఆస్ట్రా మైక్రోవేవ్ షేరు 5 శాతం జంప్‌చేసింది. రూ. 322 వద్ద ముగిసింది. తొలుత రూ. 329ను సైతం దాటింది. ► ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ నుంచి రూ. 343 కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టును పొందడంతో అయాన్ ఎక్సే్ఛంజ్ (ఇండియా) షేరు 2.4 శాతం బలపడి రూ. 2,975 వద్ద నిలిచింది. తొలుత రూ. 2,988 వద్ద సరికొత్త గరిష్టాన్ని సాధించింది. ► సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై శుక్రవారం సమావేశంకానున్నట్లు పేర్కొనడంతో బజాజ్ కన్జూమర్ షేరు తొలుత 5 శాతం జంప్‌చేసి రూ. 185కు చేరింది. చివరికి 1.6 శాతం లాభంతో రూ. 178 వద్ద ముగిసింది. -
రంకెలేస్తున్న బుల్..లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్లు
జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసి రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఫెడ్ సీఈవో జాన్ విలియన్సన్ చేసిన వ్యాఖ్యలు, డాలర్ ఇండెక్స్ 106 స్థాయికి పతనం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పదినెలల కనిష్టానికి దిగిరావడంతో దేశీయంగా మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం 11గంటలకు సెన్సెక్స్ 315 పాయింట్ల లాభపడి 62822 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 18656 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక హెచ్‌యూఎల్, హిందాల్కో, నెస్లా, బ్రిటానియా,సిప్లా, హీరోమోటోకార్ప్,టాటా స్టీల్, ఐటీసీ, టైటాన్ కంపెనీ, ఐసిఐసిఐ, అపోలో హాస్పటిల్, జేఎస్‌డ్ల్యూస్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్,ఇండస్ ఇండ్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. -
పెట్టుబడులు పెట్టొచ్చా?ఈ వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి!
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే పరిమిత శ్రేణికి లోబడే ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. దేశీయ సూచీలు ప్రపంచ మార్కెట్ల తీరును అనుసరించే వీలుందంటున్నారు. ఇదే వారంలో ఐదు కంపెనీల షేర్లు ఎక్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘సుధీర్ఘ ర్యాలీ తర్వాత సూచీలు స్థిరీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.., గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. కమోడిటీ ధరలు దిగిరావడం, కేంద్ర బ్యాంకులు సరళతర ద్రవ్య విధాన వైఖరితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ మరింత పెరగొచ్చు. నిఫ్టీ కీలకమైన తక్షణ మద్దతు 18,300 స్థాయిని నిలుపుకోగలిగింది. కొనుగోళ్లు కొనసాగితే 18,400–18,450 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే 18,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో గతవారంలో సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ప్రపంచ పరిణామాలు యూరో జోన్ సెప్టెంబర్ కరెంట్ ఖాతా లోటు డేటా రేపు(మంగళవారం) విడుదల అవుతుంది. యూఎస్, బ్రిటన్, యూరో జోన్ దేశాల నవంబర్ తయారీ, సేవా రంగ డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. మరుసటి రోజున గురువారం(ఈ నెల 24న) అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్ విడుదల అవుతాయి. ఈ సందర్భంగా ఫెడ్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(జూలై 28న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్థిరత్వంతో పాటు వృద్ధి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందనే సానుకూల అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున దేశీయ ఈక్విటీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నవంబర్‌లో ఇప్పటి వరకు(1–17 తేదీల మధ్య) రూ.30,385 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ‘‘భారత కంపెనీల షేర్ల వ్యాల్యుయేషన్లు అధిక స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నందున రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ పట్ల బేరిష్ వైఖరిని ప్రదర్శించవచ్చు. ఇదే సమయంలో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ స్టాకులు ఆకర్షణీయమైన ధరల వద్ద లభ్యమవుతున్న తరుణంలో ఎఫ్ఐఐలు ఈ దేశాల వైపు మెగ్గుచూపవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
10.4 కోట్లకు డీమ్యాట్ అకౌంట్లు
దేశంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. దీంతో పెట్టుబడి దారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వివిధ మార్గాల్లో పెట్టు బడులు పెట్టిన మదుపర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వెరసీ ఈ అక్టోబర్ నెలకి డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య వార్షిక (ఏడాది) ప్రాతిపదికన 41 శాతం పెరిగి 10.4 కోట్లకు చేరినట్లు మోతీలాల్ ఓస్వల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. అయితే ద్రవ్యోల్బణం, రేట్ల పెంపు, ఆర్థికమాంద్యం వంటి అనిశ్చితి పరిస్థితుల కారణంగా గత కొద్ది నెలలుగా డీమ్యాట్ అకౌంట్లు తీసుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని ఓస్వల్ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో 26 లక్షలు అకౌంట్లను ఓపెన్ చేయగా ..సెప్టెంబరులో 20 లక్షలు, అక్టోబరు 18 లక్షలకు తగ్గాయని తెలిపింది. గత ఏడాది అక్టోబరులో కొత్త ఖాతాల సంఖ్య 36 లక్షలుగా ఉన్నాయి. -
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్ అదిరెన్
ముంబై: ఆర్థిక అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం దిగిరావడంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ పరుగులు తీసింది. రూపాయి అనూహ్య రికవరీ, విదేశీ కొనుగోళ్లు ర్యాలీకి మద్దతునిచ్చాయని ట్రేడర్లు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, రియల్టీ షేర్లు రాణించడంతో బెంచ్‌మార్క్ సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 1,181 పాయింట్లు పెరిగి 61,795 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 321 పాయింట్లు బలపడి 18,350 వద్ద నిలిచింది. గతేడాది అక్టోబర్ 18 తర్వాత ఇరు సూచీలకిది గరిష్ట ముగింపు స్థాయి కావడం విశేషం. నాస్డాక్ ఇండెక్స్ ఏడున్నర శాతం ర్యాలీ చేయడంతో ఐటీ షేర్లకు భారీ గిరాకీ నెలకొంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,958 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.616 కోట్ల షేర్లను కొన్నారు. సెన్సెక్స్ మూడుశాతం ర్యాలీతో స్టాక్ మార్కెట్లో రూ.2.87 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.284.46 లక్షల కోట్లకు చేరింది. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన ఈ వారంలో సెన్సెక్స్ 1,097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. లాభాలు ఇందుకే అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదవడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఎఫ్ఐఐలు ఈ నవంబర్ ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటంతో ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అయిదోరోజూ రూపీ పరుగు రూపాయి పరుగు అయిదోరోజూ కొనసాగింది. డాలర్ మారకంలో 62 పైసలు బలపడి 80.78 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ద్రవ్యోల్బణం భారీగా దిగిరావడం, డాలర్ ఇండెక్స్ బలహీనత దేశీయ కరెన్సీ ర్యాలీకి మద్దతుగా నిలిచినట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►డిఫెన్స్ ఏరోస్పేస్ రంగానికి చెందిన డీసీఎక్స్ సిస్టమ్స్ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలను పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.207)తో పోలిస్తే 38 శాతం ప్రీమియంతో రూ.286 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 55% ర్యాలీ చేసి రూ.320 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 49శాతం లాభంతో రూ.309 వద్ద స్థిరపడింది. ►హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు వరుసగా 6%, ఐదుశాతం చొప్పున లాభపడ్డాయి. ►సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత జొమాటో షేరు 14 శాతం లాభపడి రూ.72.80 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మొత్తం 3.19 కోట్ల షేర్లు చేతులు మారాయి. -
సూచీలకు రెండోరోజూ నష్టాలు
ముంబై: ఫెడ్ వడ్డీరేట్లను నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఈక్విటీ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు తలెత్తడంతో సూచీలు రెండో రోజూ డీలాపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలహీనత సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా ఆటో, ఫైనాన్స్, ఇంధన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 419 పాయింట్లు నష్టపోయి 60,613 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్లు పతనమై 18,028 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్‌క్యాప్ సూచీ ఒకటిన్నర శాతం చతికిలపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.36 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.967 కోట్ల షేర్లను అమ్మేశారు. ట్రేడింగ్ నష్టాలను భర్తీ చేసుకున్న రూపాయి ఏడు పైసలు స్వల్పంగా బలపడి 81.40 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ రెండు రోజుల్లో 571 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.3.1 లక్షల కోట్లు సంపద కోల్పోయారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.281.60 లక్షల కోట్లకు దిగివచ్చింది. భారీ లాభాల్లో అమెరికా మార్కెట్లు అమెరికా అక్టోబర్ వినియోగ ధరల(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆర్థికవేత్తల అంచనా(8%)ల కంటే తక్కువగా 7.7 శాతానికి దిగివచ్చిందని (గురువారం రాత్రి) కార్మిక శాఖ వెల్లడించింది. పరుగులు తీస్తున్న ధరలు నెమ్మదించడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా యూఎస్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీలైన డోజోన్ 3%, ఎస్అండ్పీ 3.50%, నాస్డాక్ ఏకంగా ఐదుశాతం లాభంతో కదలాడుతున్నాయి. ట్రేడింగ్‌లో 18 వేల దిగువకు నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 509 పాయింట్ల నష్టంతో 60,524 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు క్షీణించి 18,044 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కీలక రంగాల్లో తలెత్తిన అమ్మకాలతో సూచీలు ఏ దశలో కోలుకోలేకపోయాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 609 పాయింట్లు పతనమై 60,425 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 17,969 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటన మరుసటి రోజు టాటా మోటార్స్ షేరు డీలాపడింది. బీఎస్ఈలో 5 శాతం నష్టపోయి రూ.412 వద్ద నిలిచింది. ► లిస్టింగ్ తరువాత లాకిన్ పీరియడ్ ముగియడంతో నైకా షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ కొత్త తరం టెక్ షేరు చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.188 వద్ద నిలిచింది. -
ఫస్ట్‌మెరీడియన్ ఐపీవోకు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర లభించింది. దీనికి సంబంధించి అక్టోబర్ 18న అబ్జర్వేషన్ లెటర్ అందినట్లు సంస్థ తెలిపింది. ఈ లెటర్‌ను పబ్లిక్ ఇష్యూకు గ్రీన్ సిగ్నల్‌గా పరిగణిస్తారు. ఐపీవో ద్వారా ఫస్ట్‌మెరీడియన్ రూ. 800 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 50 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, మిగతా రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో విక్రయించనున్నారు. ప్రాస్పెక్టస్ ముసాయిదా ప్రకారం ప్రమోటర్ అయిన మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ రూ. 665 కోట్ల షేర్లు, ప్రస్తుత వాటాదారులు న్యూ లేన్ ట్రేడింగ్ రూ. 45 కోట్లు, సీడ్‌త్రీ ట్రేడింగ్ రూ. 40 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా వచ్చే నిధులను రుణాలు తీర్చేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 2018లో ఏర్పడిన ఫస్ట్‌మెరీడియన్‌కు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా. ఫోన్‌పే, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మొదలైనవి క్లయింట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 శాఖలు ఉండగా, 75 పైగా నగరాల్లో రిక్రూట్మెంట్లు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,110 కోట్ల ఆదాయం నమోదు చేసింది. -
మూరత్ ట్రేడింగ్ చేస్తే..ఏడాదంతా స్టాక్ మార్కెట్లో తిరుగుండదు
దేశీయ స్టాక్ మార్కెట్లో మూరత్ ట్రేడింగ్ ప్రారంభం అయ్యింది. దీపావళి పర్వదినం సందర్భంగా ట్రేడింగ్ చేస్తే .. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందనేది మదుపర్ల నమ్మకం. అందులో భాగంగా ప్రతి ఏడాది స్టాక్ ఎక్ఛేంజీలు మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఈ ట్రేడింగ్ గంట సేపు కొనసాగుతుండగా.. ఆ సమయంలో కనీసం ఒక్క స్టాకైనా కొనుక్కోవాలని ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తుంటారు. చదవండి👉 పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా! సంపదకు, ధనానికి మూలం అయిన లక్ష్మీదేవిని పూజిస్తూ మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజు ట్రేడింగ్ చేయడం వల్ల ధనంతో ఇల్లు కళకళలాడుతుందనేది గట్టి నమ్మకం. మూరత్ ట్రేడింగ్ ప్రారంభంతో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు ఇన్వెస్టర్లు పరిగణిస్తారు. కాబట్టే భారత దేశ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు స్టాక్ ఎక్ఛేంజీలు కార్యకలాపాలు జరగకపోయినా ఈ మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. చదవండి👉 '1992 స్కాం' వెబ్ సిరీస్‌లో రాకేష్ ఝున్‌ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా? అందుకే మార్కెట్ బంద్ ఉన్నప్పటికీ కూడా ‘మూరతత్’ పేరుతో 6.15 నిమిషాల నుంచి 7.15 నిమిషాల వరకు జరుగుతాయి. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత గుజరాతీలు ఈ మూరత్ ట్రేడింగ్‌లో లాంగ్ టర్మ్‌లో లాభాలు తెచ్చే పెట్టే స్టాక్స్ వారి కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేస్తుంటారు. అలాగే వాళ్ల నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదని, మూరత్ ట్రేడింగ్ సమయంలో కొన్ని స్టాక్స్ భారీ లాభాల్ని తెచ్చి పెట్టాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భలే సరదా మనిషి! -
అంతర్జాతీయ మార్కెట్ల అండ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతానికి పైగా లాభపడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన లార్జ్ క్యాప్ షేర్లకు డిమాండ్ లభించింది. సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 57,918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 171 పాయింట్లు బలపడి 17,186 వద్ద నిలిచింది. ఆటో, మీడియా, మెటల్, రియల్టీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టోకు ధరల సూచీ వరుసగా నాలుగో నెలా దిగిరావడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. నలభై ఏళ్ల గరిష్టానికి ఎగబాకిన ద్రవ్యోల్బణాన్ని విస్మరిస్తూ.., షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో గురువారం అమెరికా మార్కెట్లు రెండుశాతానికి పైగా లాభపడ్డాయి. ఆసియా(+2%), యూరప్(+1.50%)తో సహా భారత మార్కెట్లు ఇక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,011 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,624 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఎనిమిది పైసలు క్షీణించి 82.32 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయాయి. ‘‘జాతీయ, అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో గత రెండు వారాలుగా మార్కెట్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. త్వరలో ఈ దశ ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుత ఒడిదుడుకుల పరిస్థితుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన రంగాలు, షేర్లపై దృష్టి సారిస్తూ నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవాలి. క్యూ2 ఆర్థిక ఫలితాలు, పండుగ సీజన్ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతల దృష్ట్యా రానున్న రోజుల్లో మార్కెట్ ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించడంతో పాటు షేర్ల బైబ్యాక్ ప్రకటనతో ఇన్ఫోసిస్ షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో నాలుగు శాతం లాభపడి రూ.1,474 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఐదుశాతానికి పైగా ర్యాలీ చేసి రూ.1,494 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఎక్సే్చంజీలో 5.20 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.22,879 కోట్లు పెరిగి రూ.6.20 లక్షల కోట్లకు చేరింది. ►ఈ క్యూ2లో రికార్డు స్థాయి నికర లాభాన్ని నమోదు చేయడంతో ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ షేరు నాలుగు శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.130 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 5% ఎగసి రూ. 132 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
ఈ ప్రకటనలు నమ్మొద్దు.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ హెచ్చరిక
ముంబై: ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఎయిమర్స్ ట్రేడర్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘సురజ్ మౌర్య అనే వ్యక్తి ఎయిమర్స్ ట్రేడర్ పేరుతో టెలిగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టి మోసవద్దు. దీనికి ఎక్ఛేంజీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో ఈ ఆగస్టులో రియల్ ట్రేడర్, గ్రో స్టాక్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్‌లను సైతం స్టాక్ ఎక్ఛేంజీ నిషేధించింది. -
ఢమాల్ స్ట్రీట్.. 17వేల దిగువకు నిఫ్టీ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 844 పాయింట్లు పతనమై 57,147 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 257 పాయింట్లు క్షీణించి కీలకమైన 17వేల స్థాయి దిగువన 16,984 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లకు గానూ యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కాయి. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్, ఐటీ, కన్జూమర్ షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.61%, 1.47 శాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4612 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2431 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లు 2–3%, యూరప్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. రోజంతా నష్టాల్లోనే.. సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 58,004 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 17,256 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలకు మొగ్గుచూపాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు పతనమై 57,050 వద్ద నిఫ్టీ 291 పాయింట్లు క్షీణించి 16,950 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాలు ఎందుకంటే... ఆరునెలల్లో ఆర్థిక మాంద్యం తప్పదని జేపీ మోర్గాన్ సీఈఓ వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలవడంతో సెంటిమెంట్ దెబ్బతింది. రష్యా – ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. డాలర్ ఇండెక్స్ 113 స్థాయిపైకి చేరుకోవడంతో భారత కరెన్సీ బలహీనపడటం ఈక్విటీలపై మరింత ఒత్తిడి పెరిగింది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఆస్థిరతలకు తాజాగా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తోడవ్వడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకొనేందుకు వెనుకాడారు. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, యూఎస్ ఫెడ్ మినిట్స్ విడుదల ముందు అప్రమత్తత చోటుచేసుకొనే అవకాశం ఉన్నందున మార్కెట్లు కొంతకాలం ఒత్తిళ్లకు లోనుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ క్యూ2 మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.., ఐటీ దిగ్గజం టీసీఎస్ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయి రూ.3,069 వద్ద ముగిసింది. ♦ బీఎస్ఈలో నమోదిత కంపెనీలకు 4.3 ల క్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.270 లక్షల కోట్ల దిగువకు చేరింది. ♦అమెరికా ఆధారిత రూట్ వన్ హెడ్జ్ ఫండ్ మంగళవారం ఇండస్ ఇండ్‌కు చెందిన 1.20 కోట్ల ఈక్విటీ షేర్లను(1.54% వాటా) ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించింది. ఈ ♦ లావాదేవీ విలువ రూ. 1,401 కోట్లుగా ఉంది. ఇండస్ ఇండ్ షేరు 4% నష్టపోయి రూ.1,165 వద్ద స్థిరపడింది. -
బుల్‌ను పడేసిన బేర్..నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతుంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణించడం, ఉక్రెయిన్–రష్యా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ రేట్లను పెంచొచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం 9.25గంటల సమయానికి సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 57800 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ సైతం 60 పాయింట్లు నష్ట పోయి 17180 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. సోమవారం (సెప్టెంబర్ 10) నుంచి దేశీ ఐటీ సేవల కంపెనీలు ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. సోమవారం టీసీఎస్ క్యూ2 ఫలితాల్ని విడుదల చేయగా...విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో నేడు ఈక్విటీ మార్కెట్లో విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి టెక్ కంపెనీల షేర్లు లాభాల వైపు పరుగులు తీస్తున్నాయి. వీటితోపాటు అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, ఆల్ట్రా టెక్ సిమెంట్, లార్సెన్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అపోలో హాస్పిటల్, ఎథేర్ మోటార్స్, దివిస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, మారుతి సుజికీ షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.