ముంబై: స్టాక్ ఎక్సేంజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కన్నెర్ర చేసింది. ట్రేడింగ్ విషయంలో సాంకేతిక ఇబ్బందుల పేరుతో ఇన్వెస్టర్లను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. నాలుగు గంటలకు మించి టెక్నికల్ గ్లిచెస్ కొనసాగితే భారీగా జరిమానాలు విధిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను జారీ చేసింది.
రంగంలోకి సెబీ
నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో 2021 ఫిబ్రవరి 24న టెక్నికల్ ఇష్యూస్‌తో 4 గంటల పాటు ట్రేడింగ్ నిలిచి పోయింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్స్, డిపాజిటరీలులకు కీలక ఆదేశాలు సెబీ జారీ చేసింది. టెక్నికల్ సమస్యలు తలెత్తితే రోజుకు కనిష్టంగా లక్ష రూపాయల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు జరిమానా విధిస్తామంది. అంతేకాదు ఎమ్‌ఐఐల మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసరు(సీటీఓ)ల వార్షిక వేతనంలో 10 శాతం వరకు కోత పెడతామని తేల్చి చెప్పింది.
టెక్నికల్ ఇష్యూస్‌పై సెబీ రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్
- ఒకటి లేదా ఎక్కువ కీలక వ్యవస్థల్లో టెక్నికల్ గ్లిచెస్ వస్తే 30 నిమిషాల్లోగా పరిష్కరించాలి. లేదంటే గంటలోగా దానిని ‘డిజాస్టర్’గా ప్రకటించాలి.
- డిజాస్టర్ ప్రకటనను వెల్లడించడంలో ఆలస్యమైతే రెండు ఆర్థిక సంవత్సరాల స్టాండలోన్ నికర లాభంలో సగటున 10 శాతం లేదా రూ.2 కోట్లు, ఇందులో ఏది ఎక్కువైతే దాని ప్రాతిపదికన అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులూ తమ వార్షిక వేతనంలో 10 శాతం చొప్పున చెల్లించాలి.
- సంఘటన జరిగిన తర్వాత 75 నిమిషాల నుంచి 3 గంటల్లోపు సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. లేదంటే ఎమ్‌ఐఐలు రూ.50 లక్షలు జరిమాన చెల్లించాలి. మూడు గంటలకు మించి టెక్నికల్ అవాంతరాలు కొనసాగితే కోటి రూపాయల జరిమాన కట్టాలి.
- సాంకేతిక సమస్యలను సరైన సమయంలో పరిష్కరించకపోతే రోజుకు రూ.2 లక్షల నుంచి 25 లక్షల వరకు జరిమాన.
- 24 గంటల్లోగా జరిగిన ఘటనలపై ప్రాథమిక నివేదిక సమర్పించాలి.
- సాంకేతిక అవాంతరానికి కారణాలను వెల్లడించే కాంప్రహెన్సివ్ రూట్‌కాజ్ అనాలసిస్(ఆర్‌సీఏ) నివేదికను 21 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆలసమ్యమైతే జరిమాన.
- నిర్దేశించిన గడువులోగా నివేదికలు ఇవ్వకపోతే... ఆ తర్వాత వచ్చే ఒక్కో వర్కింగ్‌డేకు లక్ష రూపాయల వంతున అపరాధ రుసుము చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment