ముంబై: స్టాక్ మార్కెట్ ఈ 2022 ఏడాదిని నష్టాలతో ముగించింది. ఇన్వెస్టర్లు ఏడాది చివరి ట్రేడింగ్ రోజు కావడంతో అప్రమత్తంగా వ్యవహరించారు. మాంద్యం భయాలు తెరపైకి వస్తున్న తరుణంలో కొత్త ఏడాది అవుట్‌లుక్‌పై ఆందోళనకు గురయ్యారు. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో శుక్రవారం ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి.
సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 61,329 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 18,259 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్‌లో లాభాలతో కదలాడిన సూచీలు యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో క్రమంగా నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా చివరి గంటలో బ్యాంకింగ్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 293 పాయింట్లు నష్టపోయి 60,841 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 86 పాయింట్లు పతనమై 18,105 వద్ద నిలిచింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, రియల్టీ షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,951 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,266 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 82.73 స్థాయి వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో దేశీ కరెన్సీ డాలర్ మారకంలో ఏకంగా 11.36% (844 పైసలు) క్షీణించింది.
స్టాక్ మార్కెట్‌కు కలిసిరాని 2022...
స్టాక్ మార్కెట్‌కు ఈ ఏడాది(2022) కలిసిరాలేదు. గతేడాది(2021) ఏకంగా 22% రాబడినిచ్చిన దలాల్ స్ట్రీట్ ఈ క్యాలెండర్ సంవత్సరంలో కేవలం నాలుగున్నర శాతం స్వల్పలాభంతో సరిపెట్టింది. సెన్సెక్స్ 2,586 పాయింట్లు (4.44%), నిఫ్టీ 751 పాయింట్లు(4.32%) చొప్పున ఆర్జించాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం హెచ్చరికల భయాలు మార్కెట్ ఆస్థిరతకు కారణమయ్యాయి. ఇదే ఏడాదిలో స్టాక్ మార్కెట్లో రూ.16.45 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన సెన్సెక్స్ 63,583 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,888 పాయింట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫిబ్రవరి 15న అత్యధికంగా లాభపడగా.. ఫిబ్రవరి 24న అత్యధిక నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీగా ర్యాలీ చేయగా, ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
లిస్టింగ్ రోజే ఎలీన్ ఎలక్ట్రానిక్స్ డీలా
ఎలీన్ ఎలక్ట్రానిక్స్ షేరు లిస్టింగ్ రోజే నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.247)తో పోలిస్తే ఒకటిన్నర శాతం నష్టంతో రూ.244 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఎనిమిదిన్నర శాతం క్షీణించి రూ.226 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆఖరికి 8% నష్టంతో రూ.228 వద్ద స్థిరపడింది.
క్రాఫ్ట్‌మెన్ ఆటోమిషన్ షేరు 14% ర్యాలీ చేసి రూ.3710 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. డాక్టర్ యాక్సిన్ ఇండియాను రూ.375 కోట్లకు చేజిక్కించుకోవడంతో ఈ షేరుకు డిమాండ్ లభించింది. చివర్లో కొంత లాభాల స్వీకరణ జరగడంతో 8% శాతం లాభంతో రూ.3,507 వద్ద స్థిరపడింది. హరియాణాలో రూ.624 కోట్ల రోడ్డు ప్రాజెక్ట్ దక్కడంతో హెజీ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్ 7% బలపడి రూ.616 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment