ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 844 పాయింట్లు పతనమై 57,147 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 257 పాయింట్లు క్షీణించి కీలకమైన 17వేల స్థాయి దిగువన 16,984 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌లోని 30 షేర్లకు గానూ యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కాయి. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్, ఐటీ, కన్జూమర్ షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.61%, 1.47 శాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4612 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2431 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లు 2–3%, యూరప్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి.
రోజంతా నష్టాల్లోనే..
సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 58,004 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 17,256 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలకు మొగ్గుచూపాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు పతనమై 57,050 వద్ద నిఫ్టీ 291 పాయింట్లు క్షీణించి 16,950 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
నష్టాలు ఎందుకంటే...
ఆరునెలల్లో ఆర్థిక మాంద్యం తప్పదని జేపీ మోర్గాన్ సీఈఓ వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలవడంతో సెంటిమెంట్ దెబ్బతింది. రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. డాలర్ ఇండెక్స్ 113 స్థాయిపైకి చేరుకోవడంతో భారత కరెన్సీ బలహీనపడటం ఈక్విటీలపై మరింత ఒత్తిడి పెరిగింది.
‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఆస్థిరతలకు తాజాగా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తోడవ్వడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకొనేందుకు వెనుకాడారు. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, యూఎస్ ఫెడ్ మినిట్స్ విడుదల ముందు అప్రమత్తత చోటుచేసుకొనే అవకాశం ఉన్నందున మార్కెట్లు కొంతకాలం ఒత్తిళ్లకు లోనుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
♦ క్యూ2 మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.., ఐటీ దిగ్గజం టీసీఎస్ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయి రూ.3,069 వద్ద ముగిసింది.
♦ బీఎస్‌ఈలో నమోదిత కంపెనీలకు 4.3 ల క్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.270 లక్షల కోట్ల దిగువకు చేరింది.
♦అమెరికా ఆధారిత రూట్ వన్ హెడ్జ్ ఫండ్ మంగళవారం ఇండస్ ఇండ్‌కు చెందిన 1.20 కోట్ల ఈక్విటీ షేర్లను(1.54% వాటా) ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించింది. ఈ
♦ లావాదేవీ విలువ రూ. 1,401 కోట్లుగా ఉంది. ఇండస్ ఇండ్ షేరు 4% నష్టపోయి రూ.1,165 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment