సూచీలకు స్వల్ప లాభాలు | Sensex 126 Points To Settle At 61,294, Nifty Green At 18,233 | Sakshi
Sakshi News home page

సూచీలకు స్వల్ప లాభాలు

Published Wed, Jan 4 2023 7:01 AM | Last Updated on Wed, Jan 4 2023 7:05 AM

Sensex 126 Points To Settle At 61,294, Nifty Green At 18,233 - Sakshi

ముంబై: ఆద్యంతం లాభ, నష్టాల మధ్య కదలాడిన స్టాక్‌ సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 126 పాయింట్లు పెరిగి 61,294 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 18,233 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. ఒక దశలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయితే చివరి గంట కొనుగోళ్లతో ఇంట్రాడే గరిష్టం వద్ద ముగిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 93 పాయింట్ల నష్టంతో 61,075 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 339 పాయింట్ల పరిధిలో 61,004 వద్ద కనిష్టాన్ని, 61,344 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 18,163 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 18,150 – 18,252 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. కమోడిటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.22%, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.18 శాతం పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.628 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.351 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. డాలర్‌ మారకంలో 22 పైసలు పతనమై 83.00 స్థాయి వద్ద స్థిరపడింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు 

జొమాటో సహ వ్యవస్థాపకులు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ గుంజన్‌ పాటిదార్‌  రాజీనామాతో కంపెనీ షేరు 2 శాతం నష్టపోయి రూ.58.90 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగుశాతానికి పైగా నష్టపోయి రూ.57.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. 

స్వల్ప శ్రేణి ట్రేడింగ్‌లోనూ బీమా కంపెనీల షేర్లకు డిమాండ్‌ లభించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 4.50%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 4%, ఎల్‌ఐసీ 3.50%, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రెండుశాతం చొప్పున లాభపడ్డాయి.

ఎన్‌డీటీవీ వాటాదారులకు జోష్‌
ఎన్‌డీటీవీ వాటాదారులకు బోనస్‌లాంటి వార్త. ఇటీవలే ఎన్‌డీటీవీని చేజిక్కించుకున్న అదానీ గ్రూప్‌.. మీడియా సంస్థ వాటాదారులకు షేరుకి రూ. 48.65 చొప్పున అదనంగా చెల్లించేందుకు నిర్ణయించింది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 5 మధ్య షేర్లను టెండర్‌ చేసిన ఎన్‌డీటీవీ వాటాదారులకు తాజా చెల్లింపు వర్తించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement