
ప్రపంచవ్యాప్తంగా బలపడిన సెంటిమెంటుతో దేశీయంగానూ స్టాక్ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి నుంచీ మార్కెట్లు జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 58,000, నిఫ్టీ 17,000 పాయింట్ల మైలురాళ్లను మరోసారి అధిగమించాయి. అన్ని రంగాలూ లాభాలతో ముగిశాయి. దీంతో మిడ్ క్యాప్స్ సైతం హైజంప్ చేశాయి.
ముంబై: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పరుగందుకోవడంతో దేశీయంగానూ బుల్ కదం తొక్కింది. సెన్సెక్స్ 1,277 పాయింట్లు పురోగమించి 58,065 వద్ద నిలిచింది. నిఫ్టీ 387 పాయింట్లు జంప్‌చేసి 17,274 వద్ద స్థిరపడింది. వెరసి ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 పాయింట్ల మైలురాళ్లను సులభంగా దాటేశాయ్. ప్రారంభంనుండీ ఇన్వెస్టర్లు అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లకు క్యూ కట్టడంతో మార్కెట్లు రోజంతా భారీ లాభాలతో సందడి చేశాయి. దీనికితోడు ముందురోజు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు ఆపి కొనుగోళ్లు చేపట్టడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు చెప్పారు.
అన్ని రంగాలూ లాభాల్లోనే...
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 3–1 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీ 3 శాతం పుంజుకోగా.. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ 2 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ ద్వయం, కోల్ ఇండియా, టీసీఎస్, యూపీఎల్, హీరోమోటో, జేఎస్‌డబ్ల్యూ, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎల్‌అండ్‌టీ, విప్రో, ఐటీసీ, యాక్సిస్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్ 5–3 శాతం మధ్య జంప్ చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం పవర్‌గ్రిడ్ 1 శాతం నీరసించగా.. డాక్టర్ రెడ్డీస్ స్వల్పంగా క్షీణించింది.
ఇన్వెస్టర్ల సంపద ప్లస్...
స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ కావడంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) భారీగా ఎగసింది. ఒక్క రోజులోనే దాదాపు రూ. 5,66,319 కోట్లు జమయ్యింది. వెరసి బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.2,73,92,740 కోట్లకు బలపడింది. బీఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 2.3% జంప్‌చేయగా, అన్ని రంగాలూ బలపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ 2.4–1.4% చొప్పున పుంజుకున్నాయి. వీటికితోడు మెటల్స్, ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్, ఐటీ 3%స్థాయిలో లాభపడటం మార్కెట్ విలువకు దన్నునిచ్చింది.
రూపాయి అప్
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బలపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం ట్రేడింగ్‌లో 20 పైసలు పుంజుకుని 81.62 వద్ద ముగిసింది. దేశీ ఈక్విటీలలో వరుసగా రెండో రోజు విదేశీ ఇన్వెస్టర్లు నికర పెట్టుబడిదారులుగా నిలవడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడటం వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంట్రాడేలో రూపాయి 81.36 వరకూ పుంజుకుంది. 81.66 వద్ద కనిష్టాన్ని తాకింది. విదేశీ మార్కెట్లో డాలరు ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయి 111.20కు చేరింది.
యూఎస్ దూకుడు...
ఒక్కసారిగా మారిన పరిస్థితులతో సోమవారం అమెరికా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఆసియా, యూరోపియన్ మార్కెట్లు సైతం 2.5–3% మధ్య ఎగశాయి. కేంద్ర బ్యాంకు ఆరోసారి వడ్డీ రేట్లను పెంచడం ద్వారా తొమ్మిదేళ్ల గరిష్టం 2.6%కి ప్రామాణిక రేట్లను చేర్చినప్పటికీ ఆస్ట్రేలియా స్టాక్ ఇండెక్స్ 4% జంప్ చేసింది. తాజా గణాంకాలు డాలరు ఇండెక్స్, ట్రెజరీ ఈల్డ్స్‌ను దెబ్బతీశాయి. ఫెడ్ ఇకపై వడ్డీ రేట్ల పెంపు అంశంలో నెమ్మదించవచ్చన్న తాజా అంచనాలు స్టాక్స్ సహా పసిడి, వెండి, చమురు, క్రిప్టో కరెన్సీలకు డిమాండును పెంచినట్లు విశ్లేషకులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment