
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే జరిగే ఈ వారంలో స్టాక్ సూచీల స్థిరీకరణకు వీలుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని చెబుతున్నారు. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు కీలకమంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. చైనా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అమెరికా వైట్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన చేయడంతో ప్రపంచ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొహర్రం సందర్భంగా మంగళవారం(ఆగస్టు 9న) సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది.
‘‘గడిచిన నెలన్నర రోజుల్లో సూచీలు 19% ర్యాలీ చేసిన నేపథ్యంలో మార్కెట్ ఓవర్‌బాట్ పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికీ సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉన్నందున సూచీల స్థిరీకరణకు వీలుంది. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 17,500 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. కీలకమైన ఈ స్థాయిని అధిగమించగలిగే 17,800–17,900 శ్రేణిలో మరో నిరోధం ఎదురుకావొచ్చు. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17300–17180 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం., వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో గతవారంలో స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. ఐటీ, మెటల్, ఆటో, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 818 పాయింట్లు, నిఫ్టీ 239 పాయింట్లు లాభపడ్డాయి.
స్థూల ఆర్థిక గణాంకాలు
అమెరికా, చైనాలు బుధవారం(10న) జూలై ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఆర్థికంగా అగ్ర రాజ్యాలైన ఈ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మక, కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. ఇక దేశీయంగా.., జూలై నెల రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలతో పాటు జూన్ మాసపు పారిశ్రామికోత్పత్తి డేటా శుక్రవారం(12న) విడుదల కానుంది. అదేరోజున ఆర్‌బీఐ ఆగస్టు ఐదో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూలై 29వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.
చివరి దశకు క్యూ1 ఫలితాలు
దేశీయ కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన ఘట్టం చివరి దశకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ ముందుగా నేడు ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్, బీపీసీఎల్ జూన్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 2,400కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఐషన్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా కన్జూమర్ ప్రాడెక్ట్స్, దివీస్ ల్యాబ్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది.
వారం రోజుల్లో రూ.14 వేల కోట్ల కొనుగోళ్లు
దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టు తొలివారంలో రూ.14,175 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, దేశీయ కార్పొరేట్ జూన్ క్వార్టర్ ఫలితాలు మెప్పించడం ఇందుకు కారణమని నిపుణులంటున్నారు. జూలైలో రూ.5 వేల కోట్ల విలువైన షేర్లను కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు(తొమ్మిది నెలల్లో) ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 2.46 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. ‘‘రూపాయి రికవరీ, అందుబాటు ధరల వద్ద క్రూడాయిల్ లభ్యత తదితర అంశాల నేపథ్యంలో మరికొంతకాలం పాటు ఎఫ్‌ఐఐలు ధోరణి సానుకూలంగా ఉండొచ్చు’’ అని యస్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు హితేశ్ జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment