ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రాణించడంతో పాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో స్టాక్ సూచీలకు రెండురోజుల తర్వాత లాభాలొచ్చాయి. ఇటీవల దిద్దుబాటుకు లోనైన ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కూడా కలిసొచ్చింది. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 437 పాయింట్లు పెరిగి 55,818 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 105 పాయింట్లు దూసుకెళ్లి 16,628 వద్ద నిలిచింది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న తరహా షేర్లకు అధిక డిమాండ్ లభించడంతో బీఎస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆరశాతానికి పైగా లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.452 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.131 కోట్ల షేర్లు కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు క్షీణించి 77.60 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
‘‘జీఎస్‌టీ వసూళ్లు మే లో ప్రోత్సాహకరంగా ఉండటంతో పాటు అదే నెలలో తయారీ రంగం వృద్ధి కనబరచడంతో ఆర్థిక వ్యవస్థ స్థిరమైన రికవరీ పట్ల మార్కెట్ వర్గాలకు విశ్వాసం నెలకొంది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం సెంటిమెంట్‌ను బలపరిచింది’’ జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ట్రేడింగ్ నుంచీ స్థిరమైన కొనుగోళ్లు
ఉదయం సెన్సెక్స్ ఒక పాయింటు లాభంతో 55,382 వద్ద 306 పాయింట్ల నష్టంతో 55,622 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల పతనంతో 16,482 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలుత కొంత అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు.., తేరుకొని స్థిరంగా రాణించాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం కూడా కలిసొచ్చింది. సెన్సెక్స్ 511 పాయింట్ల బలపడి 55,892 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు దూసుకెళ్లి 16,646 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి.
ర్యాలీకి రిలయన్స్ దన్ను
రిలయన్స్ షేరు మూడున్నర శాతం సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. సెన్సెక్స్ ఆర్జించిన 436 పాయింట్లలో ఈ షేరు వాటా 281 పాయింట్లు కావడం విశేషం. తన అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్(ఆర్‌బీఎల్).., బొమ్మల తయారీ ఇటాలియన్ కంపెనీ ప్లాస్టిక్ లెగ్నో ఎస్‌పీఏ ఇండియాతో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో షేరుకు డిమాండ్ నెలకొంది. ఇంట్రాడేలో నాలుగు శాతం బలపడి ఆర్‌ఐఎల్ షేరు చివరికి మూడున్నర శాతం లాభంతో రూ.2,725 వద్ద ముగిసింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►రుణాల్లో కూరుకుపోయిన తన అనుబంధ సంస్థ రిలిగేర్ ఫిన్‌వెస్ట్ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఆఫర్‌కు రుణదాతలు ఆమోదం తెలపడంతో రిలిగేర్ ఎంటర్‌ప్రైజస్ షేరు 12% లాభపడి రూ.137 వద్ద ముగిసింది.
►సప్లై సమస్యలతో తన తొలి ఎలక్ట్రానిక్ వెహికల్(ఈవీ) లాంచింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో హీరో మోటోకార్ప్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.2,663 వద్ద స్థిరపడింది.
►అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పెంచడంతో డెల్హివరీ షేరు ఆరుశాతం లాభపడి రూ.570 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 15% ర్యాలీ చేసి రూ.617 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment