
అలెర్ట్: ఈ వారంలో స్టాక్ మార్కెట్‌కు వరుస సెలవులు! ఎందుకంటే?
ముంబై: మూడురోజులే ట్రేడింగ్ జరిగే ఈ వారంలో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం, ద్రవ్యోల్బణం అంశాలు స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు.
మహవీర్, అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం, గుడ్ ఫ్రైడ్ సందర్భంగా శుక్రవారం ఎక్స్ఛేంజీలకు సెలవు. కావున ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానుంది. వెరండా లెర్నింగ్స్ సెల్యూషన్స్ షేర్లు నేడు., హరిఓం పైప్ ఇండస్ట్రీస్ షేర్లు ఎల్లుండి ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. చిన్న, మధ్య తరహా షేర్లు రాణించడంతో గత వారంలో సెన్సెక్స్ గత వారం మొత్తంగా సెన్సెక్స్ 170 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లను ఆర్జించాయి. ‘‘సంకేతాలు కన్సాలిడేషన్‌కు అనుకూలంగా ఉన్నాయి. క్యూ4 ఫలితాల సీజన్ ప్రారంభ నేపథ్యంలో పలు షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. ఈ వారంలోనూ కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 18,100 పాయింట్ల వద్ద కీలక నిరోధాన్ని చేధించాలి. ఒకవేళ అమ్మకాలు జరిగితే 17,600 వద్ద తక్షణ మద్దతు ఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు.
కార్పొరేట్ల ఫలితాల సందడి షురూ
దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నేడు నాలుగో త్రైమాసికం(క్యూ4)తో పాటు పూర్తి ఏడాది (2020 – 21) గణాంకాలను ప్రకటించి స్టాక్ మార్కెట్లో ఆర్థిక ఫలితాల సందడిని షురూ చేయనుంది. ఇన్ఫోసిస్ బుధవారం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు శనివారం తమ క్యూ4 ఆర్థిక ఫలితాలను వెల్లడించున్నాయి. వీటితో పాటు అలోక్ ఇండస్ట్రీస్, బిర్లా టైర్స్, డెల్టా కార్ప్, అనంద్ రాఠీ వెల్త్, హాత్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్, ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ సర్వీసెస్ గణాంకాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు క్వార్టర్ గణాంకాలపై దృష్టి సారించవచ్చు.
స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ), రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు మంగళవారం వెల్లడికానున్నాయి. అదేరోజున ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ డేటా వెలువడునుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా గతవారంలో ఆర్‌బీఐ పాలసీ కమిటీ 2022–23 సంవత్సరానికి గానూ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.7 శాతానికి పెంచింది. అప్పర్ బ్యాండ్ దిశలో ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడం కొంత ఆందోళనకరమైన అంశమని నిపుణులంటున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ ఆర్థిక అంశాలు మార్కెట్ గమనానికి కీలకమని వారంటున్నారు.
ఉక్రెయిన్ రష్యా యుద్ధ సంక్షోభం
ఉక్రెయిన్ రష్యా యుద్ధం 46వ రోజుకు చేరుకుంది. నెలన్నరైనా పోరు ఆగకపోవడం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కలవరపాటుకు గురిచేస్తోంది. రష్యా దళాలు రాజధాని కీవ్ నుంచి వెనుదిరిగినా.., తూర్పు ప్రాంతంలో దాడిని తీవ్రతరం చేసింది. యుద్దం ఆగేందుకు దౌత్య మార్గాలను వెతకడానికి సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.
ఆరు సెషన్లలో రూ.7,707 కోట్ల విదేశీ నిధులు
ఆరు నెలల వరుస విక్రయాలు తర్వాత ఈ ఏప్రిల్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల తొలి ఆరు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.7,707 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఇటీవల కరెక్షన్‌లో భాగంగా దిగివచ్చిన షేర్లను ఎఫ్‌ఐఐలు కొంటున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక అస్థిరతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం మారుతూ ఉంటుందన్నారు.