ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతానికి పైగా లాభపడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన లార్జ్ క్యాప్ షేర్లకు డిమాండ్ లభించింది. సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 57,918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 171 పాయింట్లు బలపడి 17,186 వద్ద నిలిచింది. ఆటో, మీడియా, మెటల్, రియల్టీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టోకు ధరల సూచీ వరుసగా నాలుగో నెలా దిగిరావడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది.
నలభై ఏళ్ల గరిష్టానికి ఎగబాకిన ద్రవ్యోల్బణాన్ని విస్మరిస్తూ.., షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో గురువారం అమెరికా మార్కెట్లు రెండుశాతానికి పైగా లాభపడ్డాయి. ఆసియా(+2%), యూరప్(+1.50%)తో సహా భారత మార్కెట్లు ఇక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,011 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,624 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఎనిమిది పైసలు క్షీణించి 82.32 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయాయి.
‘‘జాతీయ, అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో గత రెండు వారాలుగా మార్కెట్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. త్వరలో ఈ దశ ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుత ఒడిదుడుకుల పరిస్థితుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన రంగాలు, షేర్లపై దృష్టి సారిస్తూ నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవాలి. క్యూ2 ఆర్థిక ఫలితాలు, పండుగ సీజన్ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతల దృష్ట్యా రానున్న రోజుల్లో మార్కెట్ ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించడంతో పాటు షేర్ల బైబ్యాక్ ప్రకటనతో ఇన్ఫోసిస్ షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్‌ఈలో నాలుగు శాతం లాభపడి రూ.1,474 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఐదుశాతానికి పైగా ర్యాలీ చేసి రూ.1,494 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఎక్సే్చంజీలో 5.20 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.22,879 కోట్లు పెరిగి రూ.6.20 లక్షల కోట్లకు చేరింది.
►ఈ క్యూ2లో రికార్డు స్థాయి నికర లాభాన్ని నమోదు చేయడంతో ప్రైవేట్ రంగ
ఫెడరల్ బ్యాంక్ షేరు నాలుగు శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.130 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 5% ఎగసి రూ. 132 వద్ద ఏడాది
గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment