
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి రూ.5,872.13 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్‌పై గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు ఊరట లభించింది. రికవరీపై బొంబాయి హైకోర్ట్ స్టే మంజూరు చేసింది. ఈ కేసులో తన సమాధానం కోసం ఐటీ శాఖ హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బీఎస్‌ఈకి పంపిన ఒక నోట్‌లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈ విషయాన్ని తెలిపింది. 2016 గ్రూప్ వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌లో షేర్లు కొన్ని గ్రాసిమ్‌కు లభించాయి.
ఇందుకు సంబంధించి రూ.5,872.13 కోట్ల డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (వడ్డీసహా) చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నుంచి రెండు వారాల క్రితం సంస్థ నోటీసు అందుకుంది. దీనిని సవాలుచేస్తూ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది.