లక్షల కోట్ల సంపదతో ప్రపంచ కుబేరులుగా పేరొందిన పలువురిని స్టాక్ మార్కెట్లు భారీగా ముంచేస్తున్నాయి. ఒక్క రోజులోనే 2 లక్షల కోట్లు పైగా సంపదను ఆవిరి చేశాయి.
బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేగ గౌతమ్ అదానీ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌లు ఒక్క రోజులోనే సుమారు 25 మిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. సోమవారం స్టాక్ మార్కెట్‌లలో అదానీ, ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీల షేర్లు పతనం కావడంతో ఈ భారీ మొత్తం నష్టపోయారు.
గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్, అదానీ విల్‌మార్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ అండ్ అదానీ టోటల్ గ్యాస్ షేర్లు క్రాష్ అవ్వడంతో అదానీ ఒక్కరోజులోనే సుమారు రూ.78,913 కోట్ల నష్టం వాటిల్లింది.
ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం..ఎలాన్ మస్క్ సుమారు రూ.1.26లక్షల కోట్లు నష్టపోయినట్లు తేలింది. టెస్లా షేర్ల పతనంతో కార్ల తయారీ సంస్థ మార్కెట్ విలువ 71 బిలియన్ డాలర్లు క్షీణించిందని రాయిటర్స్ నివేదించింది.
భారీ నష్టాలు ఉన్నప్పటికీ, మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, లూయిస్ విట్టన్ చైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్, తరువాత అదానీ ప్రపంచంలోనే 4వ కుబేరుడిగా కొనసాగుతున్నారు.
రోజుకు రూ.1612కోట్ల సంపాదన
బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేగ గౌతమ్ అదానీ సంపద.. గత ఏడాది 116శాతం పెరిగినట్లు ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2022 జాబితా వెల్లడించిన విషయం తెలిసిందే. గత ఏడాది రోజుకు సగటున రూ.1612 కోట్లు అదానీ అర్జించారు. మొత్తంగా 10 లక్షల 94 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అదానీ అవతరించారు.
వేగంగా పెరుగుతోంది
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద అత్యంత వేగంగా పెరుగుతోంది. సరిగ్గా 10ఏళ్ల క్రితం ముఖేష్ అంబానీ సంపదలో 6వ వంతు సంపద కలిగిన అదానీ ఇప్పుడు ముఖేష్ ను దాటి చాలా ముందుకు వెళ్లారు. ప్రపంచ కుబేరుల్లో ఏకంగా రెండవ స్థానాన్ని సంపాదించుకున్నారు. రూ. 10.94 లక్షల కోట్లతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అవతరించారు.
2022 అచ్చిరాలేదు
ఈ ఏడాది సంపన్నులకు చేదు జ్ఞాపకాల్ని మిగులుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఆరు నెలల వ్యవధిలో ప్రపంచ బిలయనీర్ల సంపద భారీగా తరిగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపద ఈఏడాది ఆరంభం నుంచి 62 బిలియన్ డాలర్లకు తగ్గింది. అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 63 బిలియన్ డాలర్లుకు కరిగిపోయింది. మెటా అధిపతి మార్క్ జుకర్ బెర్గ్ సంపద ఏకంగా సగానికి పైగా తగ్గింది.
1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరి
2022లో ఇప్పటి వరకు బిలియనీర్ల జాబితాలో తొలి 500మంది కుబేరుల సంపద 2022లో తొలి అర్ధ భాగంలో 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరయ్యింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్ధిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు భారీగా ఉద్దీపన పథకాల్ని ప్రకటించగా.. టెక్ సంస్థలు భారీగా లాభాల్ని అర్జించాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల అధినేతల సంపద కూడా పెరిగింది. తాజాగా కోవిడ్ సంక్షోభం తగ్గుతుండడంతో ప్రభుత్వాలు ఉద్దీపనల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీరేట్లను కూడా పెంచేందుకు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల షేర్లు కుదేలై కుబేరుల సంపద కరిగిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment