హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టులో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) రూ. 675 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుంది. విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాటైన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీవీఐఏఎల్)లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్), ఎన్‌ఐఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
సీసీడీల రూపంలో..
కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో ఎన్‌ఐఐఎఫ్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి ఇది తమ రెండో పెట్టుబడని ఎన్‌ఐఐఎఫ్ మాస్టర్ ఫండ్ మేనేజింగ్ పార్ట్‌నర్ వినోద్ గిరి తెలిపారు. హైదరాబాద్ తరహాలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా ఉండగలదని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్‌పోర్ట్స్) జీబీఎస్ రాజు తెలిపారు.
డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన 40 ఏళ్ల వ్యవధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును 2020లో జీవీఐఏఎల్ దక్కించుకుంది. ఏపీలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఆవిర్భవించనున్న ఈ ఎయిర్ పోర్టు వార్షిక ప్రయాణికుల సామర్థ్యం తొలి దశలో 60 లక్షలుగా ఉంటుంది. తర్వాత 4 కోట్లకు చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment