వాషింగ్టన్: భారత ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాలకు హాజరయ్యేందుకు వాషింగ్టన్‌కు వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘భారత్ కరోనా మహమ్మారి కల్పించిన విపత్తు నుంచి కోలుకుని ఈ రోజు ఎక్కడ ఉందో చూడండి. మనం ముందున్న దశాబ్దాన్ని చూస్తున్నాం.
2030 భారత్‌కు బలమైన దశాబ్దం అవుతుంది. భారత్ అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కచ్చితంగా నిలుస్తుంది’’ అని మంత్రి సీతారామన్ అన్నారు. భారత్ కరోనాకు ముందు, ఆ తర్వాత ఎన్నో సంస్కరణలను చేపట్టిందని గుర్తు చేశారు. కరోనా విపత్తును అవకాశంగా మలుచుకుని సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లినట్టు వివరించారు. తక్కువ వ్యయాలు, డిజిటైజేషన్ స్థాయి అన్ని రకాల తరగతుల్లోనూ పౌరుల జీవనాన్ని సులభతరం చేసినట్టు చెప్పారు. ‘‘టెక్నాలజీ పల్లెలకు కూడా చేరింది. వారు ఇప్పుడు టెక్నాలజీ వినియోగం తెలిసిన వారు. స్మార్ట్‌ఫోనే అవసరం లేదు.. ఫీచర్ ఫోన్ ఉన్నా చాలు. టెక్నాలజీ ఎంతో మంది ప్రజలకు చేరువ అవుతోంది’’ అంటూ భారత్ సాధిస్తున్న ప్రగతిని మంత్రి సీతారామన్ వివరించారు.
క్రిప్టోలను కట్టడి చేయాల్సిందే..
క్రిప్టోల నియంత్రణ అన్నది అంతర్జాతీయంగా ఉండాలని.. అప్పుడే మనీల్యాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడడం సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిర్వహించిన అత్యున్నత స్థాయి ప్యానెల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు.
క్రిప్టో ఆస్తుల్లో ప్రభుత్వం జోక్యం లేకుండా, వ్యాలెట్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగినంత కాలం వాటి నియంత్రణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యాంకు నిర్వహణలోని డిజిటల్ కరెన్సీ రూపంలో అయితే దేశాల మధ్య చెల్లింపులు మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. భారత్‌లో క్రిప్టోలపై పన్ను విధింపు అన్నది వాటిల్లోకి వచ్చే పెట్టుబడుల మూలాలు తెలుసుకునేందుకే గానీ, చట్టబద్ధత కల్పించడం కాదని స్పష్టం చేశారు.
ఐఎంఎఫ్ చీఫ్‌తో చర్చలు
ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవాతో నిర్మలా సీతారామన్ మంగళవారం వాషింగ్టన్‌లో భేటీ అయ్యారు. ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తదతర అంశాలపై చర్చించారు. మూలధన వ్యయాలు చేయడం ద్వారా వృద్ధికి మద్దతుగా నిలిచేందుకు భారత్ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. పరిమిత ద్రవ్య వెసులుబాట్ల మధ్య భారత్ అనుసరించిన విధానపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడేందుకు సాయపడినట్టు ఈ సందర్భంగా జార్జీవా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్లు ఉన్నప్పటికీ అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగడం పట్ల జార్జీవా చర్చించారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావం పట్ల, ఇంధన ధరల పెరుగుదల సవాళ్లపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా–భారత్ బంధం పటిష్టం
భారత్–అమెరికా బంధం మెరుగైన స్థితిలో ఉందని, ప్రస్తుత సవాళ్ల సమయంలో ఇది ప్రపంచక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రి సీతారామన్ అన్నారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు వాటి విస్తృతిని గుర్తించాయని, ఒకరితో ఒకరు కలసి పనిచేసేందుకు సౌకర్యంగా ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment