న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిగుమతులపైనా, దేశీయంగా సరఫరాపైనా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మినహాయింపునిస్తే అవి మరింత ఖరీదుగా మారతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ముడి వస్తువులపై చెల్లించిన పన్నులను తయారీ సంస్థలు ఆఫ్‌సెట్ చేసుకునే అవకాశం కోల్పోవడమే ఇందుకు కారణమవుతుందని ఆమె పేర్కొ న్నారు. ప్రస్తుతం దేశీయంగా టీకాల సరఫరా, వ్యాపారపరమైన దిగుమతులపై 5 శాతం, కోవిడ్ ఔషధాలు.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం జీఎస్‌టీ వర్తిస్తోంది.
‘ఒకవేళ జీఎస్‌టీ నుంచి పూర్తి మినహాయింపునిస్తే.. టీకాల తయారీ సంస్థలు తాము కట్టిన పన్నులను ఆఫ్‌సెట్ చేసుకునే అవకాశం లేక రేట్ల పెంపు ద్వారా ఆ భారాన్ని అంతిమంగా వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది. కాబట్టి జీఎస్‌టీ మినహాయింపు వల్ల వినియోగదారుకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడమే కాకుండా ప్రతికూల ఫలితాలు ఇస్తుంది’ అని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో మంత్రి ట్వీట్ చేశారు. ఉత్పత్తులపై విధించే సమీకృత జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ)లో రాష్ట్రాలకే 70 శాతం పైగా వాటా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment