Nita Ambani Birthday: ‘సంపూర్ణ’ సంపన్నురాలు! | Nita Ambani Birthday Philanthropist Entrepreneur And More - Sakshi
Sakshi News home page

Nita Ambani Birthday: ‘సంపూర్ణ’ సంపన్నురాలు! తనకంటూ ప్రత్యేకంగా..

Published Wed, Nov 1 2023 12:27 PM

Nita Ambani Birthday Philanthropist entrepreneur and more - Sakshi

Nita Ambani Birthday: రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌, వ్యాపారవేత్త నీతా అంబానీ నవంబర్ 1న 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. విద్యావేత్త, పరోపకారి, ఎంటర్‌ప్రిన్యూర్‌, కళలు,  క్రీడల పోషకురాలైన నీతా అంబానీ రూ. 23 వేల కోట్ల నుంచి రూ. 24 వేల కోట్ల నెట్‌వర్త్‌ అంచనాతో పలు భారీ బిజినెస్‌ వెంచర్‌లకు నాయకత్వం వహిస్తున్నారు.

నీతా అంబానీ ముంబైలోని గుజరాతీ కుటుంబంలో 1963 నవంబర్ 1న జన్మించారు. నీతా నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమెకు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది. ముఖేష్ అంబానీతో పరిచయానికి ముందు ఆమె టీచర్‌గా పనిచేసేవారు. ఆ తర్వాత 1985లో  ముఖేష్‌ అంబానీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఒక కుమార్తె ఇషా అంబానీ ఉన్నారు.

 

భారతీయ వ్యాపార రంగంలో మొదటి మహిళగా ప్రసిద్ధి చెదిన నీతా అంబానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఆమెనే. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీల బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు కూడా. జీవితంలో అనేక మైలురాళ్లను సాధించిన నీతా అంబానీ ఎంటర్‌ప్రిన్యూర్‌గానేకాక చురుగ్గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. 

నీతా ఘనతలు ఇవే..
క్రీడల్లో మెరుగుదలకు సంబంధించి నీతా అంబానీ చేపట్టిన కార్యక్రమాలకు, అప్పటి భారత రాష్ట్రపతి ఆమెను 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు 2017'తో సత్కరించారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా అందించే ఇండియన్ స్పోర్ట్స్  ఉత్తమ కార్పొరేట్ సపోర్టర్‌గానూ ఆమె అవార్డును అందుకున్నారు. 

ఇవి కాకుండా నీతా అంబానీ ఇటీవల యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) 2023 నుంచి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు. దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతకు చేసిన కృషికి గాను ఆమెకీ అవార్డ్‌ దక్కింది.

 

బిజినెస్ వెంచర్స్
నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్. సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో 2010లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక దేశంలో మహిళా సాధికారత కోసం పనిచేసే 'హర్ సర్కిల్' అనే ఇంటరాక్టివ్ డిజిటల్ ఉద్యమాన్ని కూడా స్థాపించారు నీతా అంబానీ. 

ఐపీఎల్‌లో అనేకసార్లు టోర్నమెంట్‌ను గెలుపొందిన ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆమె సహ యజమాని. అలాగే ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కూడా. ఇది దేశ ఫుట్‌బాల్ చరిత్రలో విప్లవాత్మకమైన ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించింది.

ముంబైలో 2003లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను స్థాపించిన నీతా అంబానీ దానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కళలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రోత్సహించేందుకు ముంబైలో ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను నీతా ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement