
రాజీవ్‌కుమార్, సుమన్ కే బెరీ
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీవ్‌కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో కొత్త వైస్ చైర్మన్‌గా సుమన్ కే బెరీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 1న బెరీ నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. వాస్తవానికి రాజీవ్‌కుమార్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీనికి కేవలం కొన్ని రోజులు ముందు ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదించినట్టు, ఏప్రిల్ 30న బాధ్యతల నుంచి వైదలగొనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. సుమన్ కే బెరీ లోగడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగానూ పనిచేశారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన కుమార్ 2017 ఆగస్ట్‌లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వరకు అరవింద్ పనగరియా ఈ బాధ్యతలు చూశారు. ఆయన తిరిగి అధ్యాపక వృత్తి వైపు వెళ్లిపోవడంతో రాజీవ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతలు కట్టబెట్టింది.
చదవండి: (నా భుజానికున్నది భారతీయ టీకానే!: బోరిస్ జాన్సన్)