సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలకు నష్టమే తప్ప ఒనగూరేదేమీ ఉండదన్నారు. ఈమేరకు శనివారం లక్ష్మణ్ మీడియా ప్రకటన విడుదల చేశారు.
నీతిఆయోగ్ ద్వారా ముఖ్యమంత్రుల గౌరవాన్ని పెంచి టీం ఇండియా స్ఫూర్తిని చాటిన ప్రధాని నరేంద్రమోదీపై రాజకీయ లబ్ధి కోసం అవాకులు చెవాకులు పేలడం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్ధాలు, అర్ధ సత్యాలేనని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు చేసిన కుట్రగానే భావిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ బండారాన్ని బయటపెడతామని లక్ష్మణ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment