న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఎన్‌ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నర్ స్టీల్ ప్లాంటు(ఎన్‌ఎస్‌పీ)ను విడదీసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్టీల్ శాఖ తాజాగా వెల్లడించింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసే బాటలో కంపెనీకి చెందిన వాటాదారులు, రుణదాతలతో నేడు(7న) సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్‌ఎస్‌పీని పూర్తిస్థాయిలో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లు ఒక అధికారిక ప్రతిలో స్టీల్ శాఖ పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ సమీపంలో 3 మిలియన్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యంతో ఎన్‌ఎస్‌పీ ఏర్పాటవుతోంది. 1,980 ఎకరాలలో యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకు రూ. 23,140 కోట్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఎన్‌ఎండీసీ నుంచి ఎన్‌ఎస్‌పీని విడదీసేందుకు 2020 అక్టోబర్‌లో కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. తద్వారా కంపెనీలో కేంద్రానికున్న మొత్తం వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుడికి విక్రయించనుంది. మంగళవారం నిర్వహించనున్న సమావేశాలకు స్టీల్ శాఖ అదనపు కార్యదర్శి రాశికా చౌబే అధ్యక్షత వహించనున్నారు.
ఈ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎండీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.6 శాతం నీరసించి రూ. 125 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment