సాధారణంగా రైల్వే స్టేషన్లలో నడవలేని వారి కోసం వీల్‌చైర్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించుకోవడానికి ఏ మాత్రం ఫీజు చెలాయించాల్సిన అవసరం లేదు. కానీ ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఓ పోర్టర్.. ఎన్‌ఆర్‌ఐ (NRI) ప్యాసింజర్ నుంచి రూ.10,000 వసూలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో వీల్‌చైర్ సేవలను అందించినందుకు పోర్టర్ రూ. 10వేలు వసూలు చేసాడు. ఈ ఘటన డిసెంబర్ 28న జరిగినట్లు తెలిసింది. ఆ స్టేషన్‌లో వీల్‌చైర్ సర్వీస్ ఉచితం అని తెలుసుకున్న ఆ ఎన్‌ఆర్‌ఐ కుమార్తె రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఎన్‌ఆర్‌ఐ నుంచి 10,000 రూపాయలు వసూలు చేసిన ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టి, స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ పోర్టర్‌ను గుర్తించారు. ఎన్‌ఆర్‌ఐ దగ్గర నుంచి వసూలు చేసిన రూ. 10వేల రూపాయలలో 90 శాతం వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా ఆ పోర్టర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసి.. అతని దగ్గర ఉన్న బ్యాడ్జ్‌ను కూడా అధికారులు వెనక్కి తీసుకున్నారు.
ప్రయాణికులను మోసం చేస్తే సహించేది లేదని, ఇలాంటి ఘటనలు రైల్వే ప్రతిష్టతను దెబ్బతీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల ప్రయోజనాలకే మొదట ప్రాధాన్యత కల్పిస్తామని వారు స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ప్రయాణికులు 139 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వారు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment