హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక ప్రకారం.. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, పుణే, బెంగళూరులో ఈ ఏడాది జూలై–సెప్టెంబరు కాలంలో కొత్తగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ 54 లక్షల చదరపు అడుగులకు పరిమితమైంది. గతేడాది ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 50% తక్కువ.
కరోనా నేపథ్యంలో కార్పొరేట్స్, కో–వర్కింగ్ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల వాయిదాతోపాటు వర్క్ ఫ్రమ్ హోం విధానమూ ఇందుకు కారణం. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 64% వృద్ధి సాధించింది. ఈ 7 నగరాల్లో 2019 జనవరి–సెప్టెంబరులో పలు కంపెనీలు కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం 3.27 కోట్ల చదరపు అడుగులు. ఈ ఏడాది ఇది 47% తగ్గి 1.73 కోట్ల చదరపు అడుగులకు చేరింది.
నగరాల వారీగా ఇలా..: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం విషయంలో బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఈ నగరంలో 27.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ పోటీపడుతోంది. ఇక్కడ 15.4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కంపెనీలు దక్కించుకున్నాయి. పుణేలో 4.6 లక్షలు, ముంబై 2.8 లక్షలు, చెన్నై 2.1 లక్షలు, ఢిల్లీ–ఎన్‌సీఆర్ 2 లక్షలు, కోల్‌కతాలో 20 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. క్యూ2తో పోలిస్తే క్యూ3లో కార్యాలయాల అద్దెలు బెంగళూరులో స్వల్పంగా పెరగగా, మిగిలిన 6 నగరాల్లో స్థిరంగా ఉన్నట్టు జేఎల్‌ఎల్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment