
గత కొద్ది రోజుల నుంచి రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికే సై అంటున్నారు. రష్యా తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద ప్రాంతాల డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు రష్యా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మంగళవారం చమురు ధరలు 2014 నుంచి గరిష్టస్థాయికి చేరుకున్నాయి.
పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
ఈ యుద్ద వాతావరణం వల్ల ముడి చమరు బ్యారెల్ ధర 100 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తునారు. "బ్యారెల్ చమరు ధర $100 కంటే ఎక్కువకు పెరిగే అవకాశం ఉంది" అని ఆయిల్ బ్రోకర్ పీవిఎంకు చెందిన తమస్ వర్గా అన్నారు. ప్రపంచ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3.48 డాలర్లు(3.7%) పెరిగి 98.94 డాలర్లుగా ఉంది. గతంలో ఇంతకు ముందు ఈ ధర 99.38 డాలర్లకు చేరుకుంది. 2014 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం.
యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యుటిఐ) క్రూడ్ ఆయిల్ ధర 4.54 డాలర్లు(4.8%) పెరిగి 95.61 డాలర్లకు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి తీవ్రత తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్రోల్, డీజిల్‌కి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం వల్ల చమరు ధరలు 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ దేశాలు, ఒపెక్+గా పిలువబడే మిత్రదేశాలు చమరు సరఫరాను ఎక్కువ పెంచడానికి ఆలోచిస్తున్నాయి.
మన దేశంలో
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు గతంలో డెలాయిట్ టచి తోమత్సు ఇండియా తన నివేదికలో పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన(మార్చి 10) తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు మిశ్రా తెలిపారు.అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే చమరు కంపెనీ పెంచలేదు అని పేర్కొన్నారు.
ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని మిశ్రా పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడం అనేది కేంద్ర బ్యాంకుకు కత్తి మీద సాము కానున్నట్లు తెలిపారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు తగ్గనున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు.
(చదవండి: ట్రంప్ అన్నంత పని చేశాడు.. ఇక సోషల్ మీడియాకు చుక్కలే?)
Comments
Please login to add a commentAdd a comment