ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ తమిళనాడులోని ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీ మొదటి దశ పనులు పూర్తయ్యే దశలో ఉన్నట్లు ప్రకటించారు. అగర్వాల్ "కేవలం 4 నెలల్లో కొన్ని ఎకరాల ఖాళీ రాతి భూమి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద 2డబ్ల్యు కర్మాగారంగా రూపాంతరం చెందింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ దశ 1 పూర్తి కాబోతోంది! స్కూటర్లు త్వరలో రాబోతున్నాయి!" అని ట్వీట్ చేశారు. మరో పోస్టులో "స్కూటర్ కోసం పెయింట్ ఆర్డర్ చేయాల్సిన సమయం వచ్చేసిందని.. ఎలాంటి కలర్ కోరుకుంటున్నారంటూ" అని ట్విటర్ లో పోస్ట్ చేశారు.
భవిష్ అగర్వాల్ షేర్ చేసిన పోస్టులో ఓలా స్కూటర్ మినిమలిస్ట్ డిజైన్ కలిగి ఉంది. స్కూటర్ చుట్టూ ఎల్ఈడీ డిఆర్ఎల్ లు ఉండే ప్రత్యేకమైన ట్విన్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. స్కూటర్ వివరాలతో పాటు, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం అవసరమయ్యే ఛార్జింగ్ నెట్ వర్క్ గురించి వివరాలను షేర్ చేశారు. దేశంలోని 400 నగరాలు, పట్టణాల్లో 1,00,000కు పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు అగర్వాల్ ప్రకటించారు. మొదటి సంవత్సరంలో ఈ నెట్ వర్క్ లో భాగంగా కంపెనీ 5,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త స్కూటర్ సింగిల్ ఛార్జ్ లో 150 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు తెలుస్తుంది. తమిళనాడులో ఇప్పటికే ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు రూ.2,400 కోట్లతో కొనసాగుతున్నాయి. రానున్న కొన్ని నెలల్లో ఇక్కడ విద్యుత్తు స్కూటర్ల తయారీ ప్రారంభం కానున్నట్లు ఇటీవలే సంస్థ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment