రూఫ్‌టాప్‌ సౌరభం! | Over 4 lakh rooftop solar systems installed across India | Sakshi
Sakshi News home page

రూఫ్‌టాప్‌ సౌరభం!

Published Wed, Nov 20 2024 5:51 AM | Last Updated on Wed, Nov 20 2024 5:51 AM

 Over 4 lakh rooftop solar systems installed across India

పీఎం సూర్య ఘర్‌ యోజన ఎఫెక్ట్‌... 

ఆరు నెలల్లో 4 లక్షల సోలార్‌ కనెక్షన్లు జత 

1.8 గిగావాట్ల సామర్థ్యం ప్లస్‌... 

ఆకట్టుకుంటున్న భారీ సబ్సిడీ, రుణ సదుపాయం 

2027 నాటికి 30 గిగావాట్ల గృహ సౌర విద్యుత్‌ లక్ష్యం

పర్యావరణానుకూల ‘గ్రీన్‌’ పాలసీల పుణ్యమా అని  దేశంలో సౌర విద్యుత్‌ రంగం వెలుగులు  విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్‌టాప్‌  సోలార్‌ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్‌ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్‌ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం!

పర్యావరణానుకూల ‘గ్రీన్‌’ పాలసీల పుణ్యమా అని  దేశంలో సౌర విద్యుత్‌ రంగం వెలుగులు  విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్‌టాప్‌  సోలార్‌ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్‌ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్‌ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం!
 

సోలార్‌ పవర్‌ ‘టాప్‌’లేపుతోంది! నివాసాల్లో సౌర విద్యుత్‌ వాడకం జోరందుకుంది. మోదీ సర్కారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌íÙప్‌ పథకం పీఎం సూర్య ఘర్‌ యోజనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో దాదాపు 4 లక్షలకు పైగా గృహ సోలార్‌ కనెక్షన్లు కొత్తగా జతయ్యాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం (ఇన్‌స్టాల్డ్‌ కెపాసిటీ) 1.8 గిగావాట్లు (జీడబ్ల్యూ)గా అంచనా.

 ఈ ఏడాది మార్చి నాటికి నివాస రూఫ్‌టాప్‌ సోలార్‌ సామర్థ్యం 3.2 జీడబ్ల్యూగా నమోదైంది. అంటే, దీంతో పోలిస్తే గడిచిన ఆరు నెలల కాలంలో 50 శాతం పైగా సామర్థ్యం ఎగబాకినట్లు పరిశ్రమ వర్గాల తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఇదంతా పీఎం సూర్య ఘర్‌ స్కీమ్‌ చలవేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంమీద చూస్తే, దేశంలో రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యం 2024 మార్చి నాటికి 11.9 జీడబ్ల్యూగా ఉంది. ఇందులో అత్యధికంగా సుమారు 60 శాతం వాటా వాణిజ్య, పారిశ్రామిక విభాగాలదే! 

సబ్సిడీ పెంపు.. తక్కువ వడ్డీకే రుణం.. 
ఇంటి డాబాలపై సౌర విద్యుత్‌ సిస్టమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ తోడ్పాటు ఎప్పటి నుంచో ఉంది. ఖర్చు తడిసిమోపెడవుతుండటంతో ప్రజల నుండి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే, గ్రీన్‌ ఎనర్జీ పాలసీపై గట్టిగా దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం గృహాల్లో సోలార్‌ వెలుగులు పెంచేందుకు పీఎం సూర్య ఘర్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ప్రధానంగా అధిక వ్యయ సమస్యకు చెక్‌ పెట్టేందుకు సోలార్‌ మాడ్యూల్స్‌పై సబ్సిడీని 40% నుంచి 60%కి పెంచింది.

 7% వడ్డీకే రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. దీంతో రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య గత కొన్ని నెలలుగా భారీగా పెరిగినట్లు జేఎంకే రీసెర్చ్, ఎనలిటిక్స్‌ తాజా నివేదికలో వెల్లడైంది. కాగా, ఈ జోరు ఇలాగే కొనసాగితే నివాస సౌర విద్యుత్‌ సామర్థ్య విస్తరణలో ఈ స్కీమ్‌ గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందనేది నిపుణుల మాట!

ఏటా 8–10 గిగావాట్లు..
దేశంలో సౌర విద్యుత్‌ వినియోగాన్ని భారీగా పెంచడంలో భాగంగా 2027 నాటికి నివాస గృహాల రూఫ్‌టాప్‌ సోలార్‌ స్థాపిత సామర్థ్యాన్ని 30 గిగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించాలంటే ఏటా 8–10 జీబ్ల్యూ వార్షిక సామర్థ్యం గల రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్లు జతకావాల్సి ఉంటుంది. ‘మిగులు విద్యుత్‌ను తిరిగి విక్రయించడంతో సహా డిస్కమ్‌ల నుంచి అనుమతులను పొందడం విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది. రుణ సదుపాయంతో పాటు ప్రజల్లో సౌర విద్యుత్‌ కనెక్షన్ల ఏర్పాటుపై అవగాహన పెంచేలా చర్యలు చేపడుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది’ అని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ వి. పేర్కొన్నారు. 

ఈ స్కీమ్‌ ద్వారా సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచడం, సోలార్‌ మాడ్యూల్స్‌పై వ్యయాలను తగ్గించడం, వినియోగదారుల్లో ఈ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించడం వంటి అంశాల నేపథ్యంలో రెసిడెన్షియల్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ మార్కెట్‌ వృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘రాష్ట్ర నియంత్రణ సంస్థలు ఈ స్కీమ్‌ అమలుకు దన్నుగా నిలుస్తున్నాయి. గృహ సోలార్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకునే కస్టమర్లకు నెట్‌ మీటరింగ్‌ను అందిస్తున్నాయి. దీనికి తోడు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వీటి ఏర్పాటుకు రుణాలిచ్చే సంస్థలు అరకొరగానే ఉండేవి. ఇప్పుడు 25కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు  ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌ కంపెనీలు రుణాలిస్తున్నా యి. దీంతో నివాసపరమైన రూఫ్‌టాప్‌ సోలార్‌ మార్కెట్‌ పుంజుకుంటోంది’ అని విక్రమ్‌ చెప్పారు.  

సవాళ్లున్నాయ్‌...
గృహాల్లో సోలార్‌ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మోదీ సర్కారు 2027 నాటికి కోటి ఇళ్లలో రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు ఏకంగా రూ.75,021 కోట్ల మొత్తాన్ని (ప్రభుత్వ వ్యయం) కేటాయించింది కూడా. భారత్‌ నిర్దేశించుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్‌ జీరో) దేశంగా అవతరించాలన్న సంకల్పానికి సూర్య ఘర్‌ పథకం చేదోడుగా నిలుస్తుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. అయితే, ఇందుకు చాలా సవాళ్లు పొంచి ఉన్నాయని... ముఖ్యంగా దేశీయంగా నివాస రంగానికి దేశీయ సోలార్‌ మాడ్యూల్స్‌ లభ్యతను పెంచాల్సి ఉందంటున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేశంలో ఫొటోవోల్టాయిక్‌ సెల్, మాడ్యూల్‌ తయారీ సామర్థ్యం, డిమాండ్‌ మధ్య భారీ అంతరం ఉందని, ఈ మేరకు ప్లాంట్ల సామర్థ్యం భారీగా పెరగాల్సి ఉందనేది వారి అభిప్రాయం. చిన్న, మధ్య తరహా గృహ విద్యుత్‌ వినియోగదారులు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకునేలా మరింత ప్రోత్సహించాలని కూడా నిపుణుల సూచిస్తున్నారు.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement