సాక్షి, న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కోవిడ్-19వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ తయారీకి ఢిల్లీకి చెందిన ఫార్మ సంస్థ పనాసియా బయోటెక్ అనుమతి సాధించింది. దేశంలోఈ వ్యాక్సిన్ తయారీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) పనాసియా బయోటెక్‌కు లైసెన్స్ మంజూరు చేసింది. తద్వారా సంవత్సరానికి 100 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా.
స్పుత్నిక్-వీ వ్యాక్సీన్‌ను తయారుచేసే తొలి సంస్థగా తమ కంపెనీ అవతరించిందని పనాసియా ఆదివారం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డి వద్ద పనాసియా ప్లాంట్‌లో తయారైన తొలి రౌండ్ వ్యాక్సిన్లు నాణ్యత నియంత్రణా ప్రమాణాలను ఇప్పటికే విజయవంతంగా పాస్ అయినట్టు కంపెనీ ప్రకటన తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ను విక్రయిస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్)తో భాగస్వామ్యం చేసుకున్న ఆరు కంపెనీలలో పనాసియా బయోటెక్ ఒకటి అని పనాసియా బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ జైన్ అన్నారు. ఈ టీకా ధర మోతాదు రూ.1,145గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వార్తలతో సోమవారం నాటి మార్కెట్‌లో పనాసియా బయోటెక్ 12 శాతానికి పైగా ర్యాలీ అయింది.
కాగా అత్యవసర వినియోగానికి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌కు ఏప్రిల్ 12 న డీసీజీఐ అనుమతినిచ్చింది. మే 14న తొలి డోస్‌ను అందించగా, సాఫ్ట్ లాంచ్‌లో భాగంగా విశాఖపట్నం, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బడ్డి, చెన్నై, మిర్యాలగుడ, కొల్లాపూర్‌లతో సహా పలు భారతీయ నగరాల్లో ఈ వ్యాక్సిన్‌ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ 67 దేశాలలో అనుమతి లభించగా మొత్తం జనాభా 3.5 బిలియన్లకు పైగా టీకాలను అందించారు. హ్యూమన్ ఎడెనోవైరస్ ప్లాట్‌ఫాంపై రూపొందించిన ఈ వ్యాక్సీన్‌ను రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ అభిృవృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రెండు-మోతాదుల వ్యాక్సిన్ తీవ్రమైన కరోనా నివారణలో 91.6 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ టీకా మార్కెటింగ్‌కోసం ఇప్పటికే ఆర్‌డీఐఎఫ్‌తో జతకట్టిన డాక్టర్ రెడ్డీస్ పనాసియా మోతాదులను కూడా మార్కెట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment