విద్యార్థికి ఫోను.. రైతుకు డ్రోను | Parliament Union Budget 2022 Highlights Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

Union Budget 2022: కడుపునిండా డిజిటల్స్‌.. విద్యార్థికి ఫోను.. రైతుకు డ్రోను.. టీవీల్లో టీచర్లు.. ఫోన్‌లైన్లో డాక్టర్లు

Published Wed, Feb 2 2022 4:32 AM | Last Updated on Wed, Feb 2 2022 1:57 PM

Parliament Union Budget 2022 Highlights Nirmala Sitharaman - Sakshi

ఉపాధి హామీకి అంటకత్తెర.. గత బడ్జెట్‌ కంటే 25 శాతం కోత, ఆహార సబ్సిడీకి క్షవరం.. ఎరువుల సబ్సిడీకి 4వ వంతు కటింగ్‌, మహిళలపై ‘సీత’కన్ను.. జెండర్‌ బడ్జెట్‌ కుదింపు వేతన జీవుల ఐటీ వేదన యథాతథం.

విద్యార్థికి ఫోను.. రైతుకు డ్రోను.  టీవీల్లో టీచర్లు.. ఫోన్‌లైన్లో డాక్టర్లు. ఇదీ.. మంగళవారం కేంద్రం విడుదల చేసిన ‘డిజిటల్‌’ కథా చిత్రమ్‌. పేపర్‌లెస్‌ బడ్జెట్‌ అని పేరు పెట్టినందుకో ఏమో గానీ...  ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మల ఆన్‌లైన్లో వీరవిహారం చేశారు. ప్రయాణం.. ఆరోగ్యం.. విద్య... కరెన్సీ.. సర్కారీ లావాదేవీలు.. ఒకటేమిటి అన్నింటిలో డిజిటల్‌ మంత్రాన్నే జపించారు.

కానీ ఒక్కటి!  ఎరువులు చల్లటానికి డ్రోన్లు ఇస్తామన్నారు. ఎరువుల సబ్సిడీని నాలుగో వంతు తగ్గించేశారు.  నిరుపేదలకూ ఇంటర్నెట్‌  ఇస్తామన్నారు కానీ... ఆహార సబ్సిడీలో 80 వేల కోట్లు  కోతవేశారు.  గ్రామీణ ఉపాధికి పెద్దదిక్కుగా ఉన్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కూ క్షవరం తప్పలేదు. ఇక ఆదాయపు పన్ను సవరణల కోసం ఆశపడ్డ వేతన జీవులను పొగిడారు తప్ప పైసా విదల్చలేదు. అలాగని పొదుపరులు, మదుపరులకు కూడా దక్కిందేమీ లేదు. ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌కు మైళ్ల దూరం నడిచే గ్రామాల్లో... ఎకరా, అరెకరాపై యావత్తు కుటుంబం ఆధారపడ్డ క్షేత్రాల్లో ఈ డిజిటల్‌ విప్లవం తెచ్చే మార్పులెలా ఉంటాయి? 

కాకపోతే..  దేశాభివృద్ధికి ప్రధాన చోదకమైన రోడ్లు,  తాగునీరు, ఇళ్ల వంటి మౌలిక సదుపాయాలకు మాత్రం నిర్మల జై కొట్టారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా ఆగిపోవటంతో... 25వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి జెండా ఊపారు. 400 వందే భారత్‌ రైళ్లనూ ప్రతిపాదించారు. రాష్ట్రాలు చేసే మూలధన వ్యయానికి కేంద్రమిచ్చే సాయాన్ని కూడా ఆర్థిక మంత్రి భారీగానే 50 శాతం వరకూ పెంచారు. 

ఇది ప్రజల బడ్జెట్‌. మరింతగా  ఇన్‌ఫ్రా, ఇన్వెస్ట్‌మెంట్లు, వృద్ధి,  ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్‌. ఆర్థిక  వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే, సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సరికొత్త అవకాశాలు చూపడమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే, అన్ని రంగాలూ మనస్ఫూర్తిగా స్వాగతించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ బడ్జెట్‌’ ఇది.  – ప్రధాని మోదీ

బడ్జెట్‌ ప్రతిపాదనలతో రేట్లు పెరిగే, తగ్గే ఉత్పత్తులు..

ఇవి ప్రియం..
దిగుమతి చేసుకున్న హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, లౌడ్‌స్పీకర్లు, గొడుగులు, స్మార్ట్‌ మీటర్లు, ఇమిటేషన్‌ ఆభరణాలు, సోలార్‌ సెల్స్, సోలార్‌ మాడ్యూల్స్, ఎక్స్‌రే మెషీన్లు, ఎలక్ట్రానిక్‌ బొమ్మల్లో విడిభాగాలు.

ఇవి చౌక ..
వజ్రాలు (కట్, పాలిష్డ్‌), కోకో బీన్స్, ఇంగువ, ఫ్రోజెన్‌ మసల్స్‌ .. ఫ్రోజెన్‌ స్క్విడ్స్‌ (సముద్ర ఆహార ఉత్పత్తులు), మీథైల్‌ ఆల్కహాల్, ఎసిటిక్‌ యాసిడ్, దుస్తులు, సెల్‌ఫోన్లలో వాడే కెమెరా లెన్స్, మొబైల్‌ చార్జర్లు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే రసాయనాలు, స్టీల్‌ స్క్రాప్‌.

మౌలిక సదుపాయాల కల్పన, డిజిటలైజేషన్‌ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.39.45 లక్షల కోట్లతో 2022–23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వందేళ్ల స్వాతంత్య్ర భారతానికి మార్గం వేస్తూ.. దీర్ఘకాలిక లక్ష్యాలతో బడ్జెట్‌ను రూపొందించినట్టు ప్రకటించారు. ప్రధానంగా రోడ్లు, ఇతర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటలైజేషన్‌పై దృష్టిపెట్టారు. విద్యా రంగం, నైపుణ్య శిక్షణకు సంబంధించి నిర్మల పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా మారిన ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించి.. ఒక్కో తరగతికి ఒక్కో టీవీ చానల్‌ ఏర్పాటు, అందులోనూ ప్రాంతీయ భాషల్లో పాఠాలు చెప్పాలన్న నిర్ణయం ఆకట్టుకుంది. డిజిటల్‌ యూనివర్సిటీలు, , చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు, కాగిత రహిత విధానం, అమల్లోకి 5జీ టెక్నాలజీ, ఆఫ్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్, టెలిమెడిసిన్‌ సేవలు, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, ‘ఈ–రూపీ’ డిజిటల్‌ కరెన్సీ ప్రవేశపెట్టడం వంటి డిజిటలైజేషన్‌ చర్యలను ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే పన్నులకు సంబంధించి దాదాపుగా ఎలాంటి మార్పులనూ ప్రకటించలేదు. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడం ఉద్యోగులు, మధ్యాదాయ వర్గాలకు నిరాశ కలిగించింది.

మరోవైపు డిజిటల్‌ ఆస్తులు, క్రిప్టో కరెన్సీలను పన్ను పరిధిలోకి తేవడం గమనార్హం. కరోనా సమయంలో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు 50 ఏళ్ల గడువుతో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను ఇస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ ప్రకటించినా.. రాష్ట్రాలు డిమాండ్‌ చేసిన మేర నిధులు, ప్రాజెక్టులు ఇవ్వలేదన్న అసంతృప్తి వ్యక్తమైంది. ఇక రక్షణ రంగంలో పరిశోధనలు చేసేందుకు.. ప్రైవేట్‌ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. 

కరోనా బాధితులకు సానుభూతితో.. 
దేశంలో కరోనా మహమ్మారి బాధితులు, ఆర్థికంగా దెబ్బతిన్నవారికి సానుభూతి ప్రకటిస్తూ నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత రెండేళ్లలో మెరుగుపర్చిన వైద్య సౌకర్యాలు, వేగవంతమైన వ్యాక్సినేషన్‌తో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా పునరుత్థానం చెందిందని, పెద్ద దేశాలన్నింటిలో అత్యధికంగా 9.2 శాతం వృద్ధి సాధించిందని వివరించారు.

2014లో తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దేశ ప్రజలు.. ముఖ్యంగా పేదల సాధికారత కోసం కృషి చేస్తున్నామని నిర్మల తెలిపారు. ప్రస్తుతం వందేళ్ల స్వాతంత్య్ర భారతం దిశగా ఆర్థిక వ్యవస్థను నడిపించడం కోసం ప్రస్తుత బడ్జెట్‌లో పునాది 
వేస్తున్నామని ప్రకటించారు. గతేడాది బడ్జెట్లో ప్రకటించిన చాలా అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద చేపట్టిన పథకాలకు మంచి స్పందన వచ్చిందని.. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తులు, 60 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. 

అద్భుత మార్పుల వైపు.. ‘గతిశక్తి’  
దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తెచ్చేందుకు మౌలిక సదుపాయాల పెంపును కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాలు పెరగడం, వాటికోసం ప్రభుత్వం చేసే వ్యయంతో.. పారిశ్రామిక వృద్ధి, వినియోగం ఊపందుకుంటాయని.. ఆర్థిక వ్యవస్థకు జోష్‌ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను అద్భుత మార్పు దిశగా తీసుకెళ్లేందుకు ‘ప్రధానమంత్రి గతిశక్తి’ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

ప్రధానంగా ఏడు చోదకశక్తులైన రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జల మార్గాలు, ప్రజా రవాణా, సరుకు రవాణా సదుపాయాలు కీలకమని వెల్లడించారు. ఈ ఏడు చోదకశక్తులకు తోడుగా ఇంధన వనరుల మార్పు, ఐటీ కమ్యూనికేషన్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు, సామాజిక మౌలిక సదుపాయాలు కలిసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు.

‘పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌’కు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం ఉమ్మడిగా ముందుకెళతాయని వెల్లడించారు. పీఎం గతిశక్తి పథకం కింద.. దేశవ్యాప్తంగా రోడ్డు, రైల్వే, ఇతర రవాణా వ్యవస్థలను విస్తరిస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రైల్వేలకు అనుసంధానంగా అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్, పర్వత ప్రాంతాల్లో రోప్‌వేలు, మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మొత్తంగా దేశంలో మౌలిక సదుపాయాల పెంపుపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు.  

డిజిటలైజేషన్‌తో.. ‘సమ్మిళిత వృద్ధి’ 
వ్యవసాయం నుంచి విద్య దాకా.. ఆరోగ్యం నుంచి బ్యాంకింగ్‌ దాకా.. ప్రజలతో ముడిపడి ఉన్న అన్నిరంగాల అభివృద్ధికి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో చోటు కల్పించారు. వ్యవసాయం సహా అన్ని రంగాల్లో సాంకేతికత వినియోగం, డిజిటలైజేషన్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు. పరిశ్రమలకు అవసరమైన తోడ్పాటు అందిస్తూనే.. విద్యా రంగంలో టెక్నాలజీ వినియోగం,, నైపుణ్యాల అభివృద్ధి అంశాలకూ బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ‘సమ్మిళిత వృద్ధి’పై దృష్టిపెట్టినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇందుకోసం వ్యవసాయం, విద్యుత్, నదుల అనుసంధానం, ఫుడ్‌ ప్రాసెసింగ్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటు, కార్మికులు, యువతలో నైపుణ్యాల అభివృద్ధి, నాణ్యమైన విద్య, డిజిటల్‌ యూనివర్సిటీలు, ఆయుష్మాన్‌ భారత్, నేషనల్‌ టెలి మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్, మహిళా శిశు సంక్షేమ పథకాలు, ఇంటింటికీ సురక్షిత మంచినీరు, అందరికీ ఇళ్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, డిజిటల్‌ బ్యాంకింగ్, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి రంగాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.  

సమర్థంగా ఉత్పాదకత.. భద్రతకు ‘పరిరక్షణ’  
ఆర్థికాభివృద్ధికోసం ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఉత్పాదకత పెంపు వంటివి ఓవైపు చేపడుతూనే.. మరోవైపు పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి చూపు సారించారు. ఇందులోనూ సాంకేతిక వినియోగం, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. పరిశ్రమలు, సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు.. మూలధనం, మానవ వనరుల ఉత్పాదకతను పెంచేందుకు సులభతర వ్యాపారం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) 2.0ను అమలు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

ప్రభుత్వ అనుమతులను మరింత సరళీకృతం చేస్తామని, ఎగుమతులను పెంచే చర్యలు చేపడతామని వెల్లడించారు. యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించే యానిమేషన్, టెలికం, కృత్రిమ మేధ (ఏఐ), జినోమిక్స్, ఫార్మా, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామన్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా పలు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను తాజా బడ్జెట్లో నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. కాలుష్య రహిత ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఎలక్ట్రిక్‌ వేస్ట్, కాలం చెల్లిన వాహనాలు, ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించడం, జాగ్రత్తగా డంప్‌ చేయడంపై దృష్టిపెడతామన్నారు. 

అభివృద్ధికి ‘పెట్టుబడి’ సాయం.. 
దేశ అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్లడానికి కీలకమైన పెట్టుబడుల (ఇన్వెస్ట్‌మెంట్‌)కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంపై నిర్మలా సీతారామన్‌ దృష్టిపెట్టారు. ప్రభుత్వ మూలధన వ్యయాన్ని భారీగా పెంచడంతోపాటు.. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి తోడ్పడే చర్యలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయానికి కేటాయింపులను ఏకంగా 35.4 శాతం పెంచారు. డేటా సెంటర్లు, విద్యుత్‌ నిల్వ వ్యవస్థలు, బ్యాటరీలు, భారీ చార్జింగ్‌ సదుపాయాల స్థాపన, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక, ఫార్మా, అగ్రిటెక్‌ సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి నిధులు అందించేలా చూస్తామని ప్రకటించారు. రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచేందుకు కేంద్రం నుంచి రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణసాయం అందించనున్నట్టు తెలిపారు.   

నాలుగు ప్రాధాన్యతలతో.. 
ఇండియా 100 విజన్‌ను సాధించే క్రమంలో ప్రస్తుత బడ్జెట్‌లో నాలుగు ప్రాధాన్యతలను ఎంచుకున్నట్టు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.  
► ప్రధానమంత్రి గతిశక్తి, 
► సమ్మిళిత అభివృద్ధి, 
► పెట్టుబడులు, ఉత్పాదకత పెంపుదల, కొత్త ఇంధనాలవైపు చూపు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, 
► అభివృద్ధికి తోడ్పడేలా పెట్టుబడుల నిర్వహణ’’.. ఆ నాలుగు ప్రాధాన్యతలని వెల్లడించారు. ఈ నాలుగు ప్రాధాన్యతల కింద 
ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement