న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ తగ్గింది. ఈ నెల మొదటి 15 రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉండడం ఇంధన వినియోగంపై ప్రభావం చూపించింది. డీజిల్ వినియోగం 13.7 శాతం తగ్గి 3.16 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో మొదటి 15 రోజుల్లో డీజిల్ వినియోగం 3.67 మిలియన్ టన్నులు ఉండడం గమనించాలి.
సాధారణంగా ఏప్రిల్–జూన్ కాలంలోని వినియోగంతో పోలిస్తే.. జూలై–సెప్టెంబర్ కాలంలో డీజిల్, పెట్రోల్ డిమాండ్ సహజంగానే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షాలతో రవాణా తగ్గుతుంది. సాగు రంగం నుంచి కూడా డిమాండ్ తక్కువగా ఉంటుంది. 2021 జూలై మొదటి 15 రోజుల వినియోగంతో పోలిస్తే మాత్రం.. ఈ ఏడాది ఇదే కాలంలో 27 శాతం వృద్ధి నమోదైంది.
ఇక 2020 ఇదే కాలంతో చూస్తే 43 శాతం పెరిగింది. పెట్రోల్ వినియోగం సైతం ఈ నెల మొదటి 15 రోజుల్లో 8 శాతం తగ్గి 1.27 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం 1.38 మిలియన్ టన్నులుగా ఉంది. 2021 జూలై మొదటి 15 రోజులతో పోలిస్తే 23 శాతం, 2020 జూలై మొదటి 15 రోజులతో పోలిస్తే 46 శాతం అధికం. ఇక 2019 జూలై 15 రోజులతో పోల్చి చూసినా పెట్రోల్ వినియోగం 28 శాతం ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment