
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాంట్రా బ్రాండ్‌లో క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సమీపంలోని మేకగూడ వద్ద 6,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. వార్షిక తయారీ సామర్థ్యం 86 లక్షల చదరపు అడుగులు. బుధవారం ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి మొదలైంది. జంబో, సూపర్ జంబో సైజులో స్లాబ్స్ తయారు చేసేందుకు ఇటలీకి చెందిన బ్రెటన్ అభివృద్ధి చేసిన బ్రెటన్‌స్టోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. స్టూడియో డిజైన్స్‌తోపాటు సహజత్వం ఉట్టిపడేలా ఉత్పత్తుల తయారీకి అత్యాధునిక రోబోలను రంగంలోకి దింపారు. క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ప్రపంచంలోని భారీ తయారీ కేంద్రాల్లో ఇదీ ఒకటని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ తెలిపారు.
ఆదాయం రూ.200 కోట్లు: కొత్త కేంద్రానికి రూ.500 కోట్లు పెట్టుబడి చేశామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ‘ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రస్తుతం 150 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నూతన ప్లాంటు ద్వారా రూ.200 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. కొత్త ఫెసిలిటీ చేరికతో సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరింది’ అని చెప్పారు. పోకర్ణ ఇప్పటికే వైజాగ్ వద్ద ఇటువంటి ప్లాంటును నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment