టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడం సులువు అవుతోంది. తెలియని అంశాలను నేర్చుకోవడానికి చాలామంది క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కొంత సమయం పట్టినా చివరకు సాధిస్తున్నారు. గతంలో సంగీతం నేర్చుకోవాలంటే ప్రత్యేక తరగతులకు వెళ్లాల్సివచ్చేది.
అందుకు కొంత డబ్బు, సమయం ఖర్చయ్యేది. అయితే ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి సంగీతాన్ని నేర్పే యాప్స్, ఇన్‌స్ట్రుమెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా జియోమీ సంస్థ అలాంటి ఓ పరికరాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
గిటార్‌లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌గా తయారు చేసిన చైనీస్ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దారు.
స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్‌ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది.
దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్ ఉకులెలెను సింథటిక్ ఫైబర్‌తో కొద్దిపాటి డిజైన్ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment