Post Office Account New Rules: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీసులకు దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది. మారుమూల గ్రామాల్లోనూ శాఖలు ఉన్నాయి. కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోస్టాఫీసుల ద్వారానే అమలవుతున్నాయి. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులు కూడా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ల ఓపెనింగ్, విత్‌డ్రాయల్, వడ్డీ లెక్కింపు, చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.
జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితి
పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితిని పెంచారు. ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులు మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుండేది. ఇప్పుడు మార్చిన నిబంధనల ప్రకారం, జాయింట్ అకౌంట్‌ను ముగ్గురు వ్యక్తులు కలిసి తెరవవచ్చు.
నగదు విత్‌డ్రా
సేవింగ్స్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రాకు సంబంధించి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కోసం కస్టమర్లు ఫారం-2, అకౌంట్ పాస్‌బుక్ సమర్పించేవారు. ఇక నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే ఫారం-3ని నింపి, పాస్‌బుక్‌తో పాటు సమర్పించాల్సి ఉంటుంది.
వడ్డీ లెక్కింపు, చెల్లింపు
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్‌లపై వడ్డీ లెక్కింపు, చెల్లింపులోనూ కీలక మార్పులు వచ్చాయి. దీని ప్రకారం ప్రతి నెలా 10వ తేదీ నుంచి ఆ నెలలో చివరి రోజు వరకు ఉన్న అతి తక్కువ డిపాజిట్ మొత్తం మీద 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి, ఆ సంవత్సరం చివరిలో సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ, సంవత్సరం పూర్తి కాకముందే ఖాతాదారు మరణిస్తే, సేవింగ్స్ అకౌంట్ మూసివేసిన నెలకు ముందు నెలాఖరులో ఆ వ్యక్తి ఖాతాలోకి వడ్డీ డబ్బును జమ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment