ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ బలహీన సెంటిమెంట్ కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు తెలిపారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్వహించిన జాక్సన్ హోల్ 45వ వార్షిక సమావేశంలో ఫెడ్ చైర్మన్ పావెల్ చేసిన ‘‘కఠినతర ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు’’ వ్యాఖ్యలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందంటున్నారు. దేశీయంగా రిలయన్స్ ఏజీఎం, జూన్ క్వార్టర్ జీడీపీ, స్థూల ఆర్థిక గణాంకాలు, ఆటో అమ్మకాలు తదితర కీలక పరిణామాల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందుకోవచ్చు. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, రూపాయి కదలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు.
నష్టాలతో ప్రారంభానికి చాన్స్..?
ద్రవ్యోల్బణ కట్టడే తమ తొలి కర్తవ్యమని, ఇందుకు కోసం వచ్చే కొద్ది నెలల్లో మరింత దూకుడుగా వడ్డీ రేట్ల పెంపు తప్పదంటూ శుక్రవారం జాక్సన్ హోల్‌లో జరిగిన వార్షిక సమావేశంలో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. ఫెడ్ చీఫ్ ‘‘కఠినతర ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు’’ వ్యాఖ్యలతో శుక్రవారం యూఎస్ నాస్‌డాక్ ఇండెక్స్ 4%, ఎస్‌అండ్‌పీ500 సూచీ మూడున్నర శాతం నష్టపోయాయి. ఆర్థిక అగ్రరాజ్యపు మార్కెట్ భారీ పతనం నుంచి దేశీయ మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలు అందుకొని నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 17,444 వద్ద స్థిరపడింది.
రిలయన్స్ ఏజీఎం సమావేశం
దేశీయ అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సమావేశం సోమవారం(నేడు) మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. ఏజీఎం వేదికగా కంపెనీ సీఎండీ ముఖేశ్ అంబానీ ప్రసంగాన్ని దలాల్ స్ట్రీట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ముఖ్యంగా 5జీ సేవల ప్రారంభం, రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ ప్రణాళికలతో పాటు టెలికాం(జియో), రిటైల్ వ్యాపారాల పబ్లిక్ ఇష్యూలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న వెల్లడి కానున్నాయి. మరసటి రోజు ఆగస్టు నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. అలాగే శుక్రవారం ఆర్‌బీఐ ఆగస్టు 26 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 12వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.
ఈ వారంలోనూ ట్రేడింగ్ 4 రోజులే..
వినాయక చవితి సందర్భంగా బుధవారం (ఆగస్టు 31) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కె ట్లు్ల ఉదయం సెషన్‌లో మాత్రమే సెలవును పాటి స్తాయి. సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి గురువారం యధావిధిగా ప్రారంభమవుతాయి.
ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో పాటు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో గతవారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలక పరిణాలేవీ లేకపోవడం కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపింది. ఐటీ, ఫార్మా, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 812 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లను కోల్పోయాయి.
‘‘జూన్ కనిష్ట స్థాయిల నుంచి భారీ ర్యాలీ తర్వాత బుల్స్ కాస్త నెమ్మదించాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 108 స్థాయిపై, బ్రెంట్ క్రూడాయిల్ ధర 100 డాలర్లపైకి చేరుకున్నాయి. ఇటీవల వెల్లడైన ప్రపంచ స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరిచిన తరుణంలో సూచీలు మరికొంత స్థిరీకరణకు లోనుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,300 వద్ద తొలి మద్దతుని, ఈ స్థాయిని కోల్పోయితే 17,000 వద్ద మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు.
కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి
దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుల్లిష్ వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ ఆగస్టులో ఇప్పటి వరకు(1–26 తేదీల మధ్య) రూ.49,250 కోట్లను భారత మార్కెట్‌లోకి మళ్లించారు. ప్రస్తుత ఏడాదిలో ఎఫ్‌పీఐలు పెట్టిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. కంపెనీల జూన్ త్రైమాసికపు ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడంతో ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు చేపడుతున్నారని నిపుణులు తెలిపారు. ఆర్థిక, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం షేర్లను కొనేందుకు అధికాసక్తి చూపుతున్నారు. ‘‘ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రకటన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సవాలుగా మారింది. రానున్న నెలల్లో కమోడిటీ ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు, కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వైఖరి తదితర అంశాలకు అనుగుణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించవచ్చు’’ అని ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ గోల్‌టెల్లర్ వ్యవస్థాపక సభ్యుడు వివేక్ బంకా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment