నాలుగేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీరేట్లు తగ్గింపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నాలుగేళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడ్ నిర్ణయంతో ఇప్పటివరకు 5.25-5.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లు 4.75-5 శాతానికి చేరినట్లయింది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా రానున్న ద్రవ్యపరపతి సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నామని చెప్పారు. వరుసగా జులై, ఆగస్టు నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా మార్కెట్ వర్గాలు వడ్డీరేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి ఈ సూచీనే ప్రామాణికంగా ఉండనుంది.
ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున సాయం
రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడిచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్‌బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment