షేర్ల ధరల్లో వృద్ధి ప్రభావం
ఇటీవల భారీగా బ్లాక్ డీల్స్
2023 రికార్డ్‌కు 2024లో చెక్
ఇటీవల సెకండరీ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరిగెడుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ నేపథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు కొంతమేర సొంత వాటాలను విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..
ముంబై: రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతూ దౌడు తీస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్‌కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం 2024 తొలి ఆరు నెలల్లోనే ఎన్‌ఎస్‌ఈ–500లోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల(రూ. 87,000 కోట్లకుపైగా) విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరొక విశ్లేషణ ప్రకారం గత రెండు నెలల్లోనే సుమారు 200 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు రూ. 33,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించడం తాజా ట్రెండ్‌కు అద్దం పడుతోంది. వెరసి దేశీ ఈక్విటీల విలువలు అత్యంత ప్రీమియంస్థాయికి చేరాయన్న సంకేతాలు వెలువడుతున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తమతమ బిజినెస్‌లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేíÙంచారు.
కరోనా ఎఫెక్ట్...
ప్రస్తుత మార్కెట్లలో పలు కంపెనీల షేర్లు గరిష్ట విలువలకు చేరడంతో బ్లాక్ డీల్స్ లేదా బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్లు కొంతమేర వాటాలను అమ్మివేస్తున్నారు. వీరికితోడు ఇటీవల పీఈ దిగ్గజాలు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత ట్రెండ్ కారణంగా 2023 జనవరి–డిసెంబర్‌లో నమోదైన 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,04,000 కోట్లు) విక్రయ రికార్డ్ 2024 కేలండర్ ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలు విక్రయించిన విషయం విదితమే. 2024లో ఇప్పటివరకూ దేశ, విదేశీ ప్రమోటర్లు మొత్తంగా రూ. 87,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 జనవరి–డిసెంబర్‌లోనూ రికార్డు నెలకొల్పుతూ రూ. 78,500 కోట్ల విలువైన షేర్లను వివిధ కంపెనీల ప్రమోటర్లు అమ్మివేశారు.
జూన్‌లో పలువురు ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా భారీగా వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలతో ఇండస్ టవర్స్‌లో యూకే దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ 18 % వాటాను విక్రయించింది. ఇక ఎంఫసిస్‌లో 15% వాటాను పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ 80 కోట్ల డాలర్లకు అమ్మింది. దేశీ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌లో ప్రమోటర్ వేదాంతా రిసోర్సెస్ 2.63% వాటా విక్రయం ద్వారా రూ. 4,184 కోట్లు సమీకరించింది. ఇక జెడ్‌ఎఫ్ కమర్షియల్ వెహికల్‌లో వాబ్కో ఏషియా 30 కోట్ల డాలర్ల విలువైన వాటాను విక్రయించింది.
విక్రయ తీరు(రూ. కోట్లలో)
కంపెనీ పేరు షేర్ల విలువ
ఇండస్ టవర్స్ 15,300
ఎంఫసిస్ 6,680
వేదాంతా 4,184
ఇంటర్‌గ్లోబ్ 3,300
జెడ్‌ఎఫ్ సీవీ 2,194
గ్లాండ్ ఫార్మా 1,754
Comments
Please login to add a commentAdd a comment